రెవెన్యూ చేతివాటం

ABN , First Publish Date - 2020-12-01T06:24:33+05:30 IST

ఇళ్ల పట్టాలు పేదల జీవితాల్లో ఎంతవరకు పండగ తెస్తాయో తెలియదు కానీ, ఈ పేరుతో నచ్చిన భూములను సేకరించి లబ్ధి పొందటంలో ప్రజా ప్రతినిధులు ముందుండగా... అధికారులు కూడా వారితో పోటీ పడుతున్నారు.

రెవెన్యూ చేతివాటం

రెవెన్యూ ఉద్యోగి ధనకార్యం

ఒక్కో పట్టా రూ.2 లక్షలకు బేర ం 

పాస్‌ పుస్తకాలు కూడా సిద్ధం

అడంగల్‌లో పేర్ల మార్పుతో వెలుగులోకి 

మండల అధికారులకు ఫిర్యాదులు 

ఉన్నతాధికారులకు తెలుస్తుందని టెన్షన్‌ 


ఇళ్ల పట్టాలు పేదల జీవితాల్లో ఎంతవరకు పండగ తెస్తాయో తెలియదు కానీ, ఈ పేరుతో నచ్చిన భూములను సేకరించి లబ్ధి పొందటంలో ప్రజా ప్రతినిధులు ముందుండగా... అధికారులు కూడా వారితో పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారాల్లో కొందరు రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులను మించిపోయి, అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి సొమ్ము కోసం కక్కుర్తి పడిన రెవెన్యూ ఉద్యోగులు కొందరు భూములను చేతులు మార్చేస్తున్నారు. చట్టాలను తుంగలో తొక్కేస్తున్నారు. రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసేస్తున్నారు. గన్నవరం మండలం జక్కులనెక్కలం, కేసరపల్లి గ్రామాల పరిధిలో సేకరించిన భూముల్లో ఈ అవినీతి బాగోతాలు చోటు చేసుకున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

పేదల ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూముల్లో కొందరు రెవెన్యూ అధికారుల ధనకార్యాలు మొదలయ్యాయి. గన్నవరం మండలం జక్కులనెక్కలం, కేసరపల్లి గ్రామాల పరిధిలో సేకరించిన భూముల్లో అవినీతి సొమ్ము కోసం కక్కుర్తిపడిన ఓ రెవెన్యూ ఉద్యోగి చేతులు మారిన భూముల్లో కొత్త అవినీతికి తెరతీశారు. జక్కులనెక్కలంలో పేదల ఇళ్ల స్థలాల కోసం 12 ఎకరాల భూమిని గుర్తించారు. దశాబ్దం క్రితం ఈ భూమిని 48 మంది పేదలకు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కొక్కరికి 25 సెంట్ల స్థలం చొప్పున అప్పట్లో కేటాయించారు. కాలక్రమంలో వీరిలో 25 మంది తమకు కేటాయించిన భూములను అమ్ముకున్నారు. వాస్తవానికి అమ్ముకునే హక్కు లేకపోయినా.. చేతులు మారాయి. ఇలా చేతులు మారిన భూములు వయోలేషన్స్‌ పరిధిలోకి వస్తాయి. ఇలాంటి భూములను ఇళ్ల పట్టాల కోసం సేకరించకూడదు. కానీ చేతులు మారిన భూములను కూడా తీసుకుని పరిహారం ఇప్పించేందుకు స్థానిక వీఆర్వో చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తన స్కెచ్‌ను అమలు చేయటానికి వీఆర్వో ఏకంగా వారితోనే డీల్‌ కుదుర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో రికార్డుల ట్యాంపరింగ్‌కు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. కొనుగోలు చేసినవారి పేరుతోనే అడంగల్స్‌లో మార్పులు చేయటం, పాసు పుస్తకాలు జారీ చేయటం వంటివి చకచకా చేసినట్టు తెలుస్తోంది. ఈ రికార్డుల ఆధారంగా పరిహారం దక్కేలా రెవెన్యూ ఉద్యోగి చక్రం తిప్పాడు. పరిహారంగా రూ.8 లక్షలు భూములను అనుభవిస్తున్న 23 మందితో పాటు, చేతులు మార్చుకున్న 25 మంది ఖాతాల్లో కూడా పడిపోయాయి. డబ్బులు పడే ముందు ఒక్కొక్కరి నుంచి రూ. రెండు లక్షలు తనకు చెల్లించాలని ఆ ఉద్యోగి డీల్‌ కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్‌ ప్రకారం కొందరు ఆ మొత్తాన్ని సమర్పించుకున్నట్టు సమాచారం. గ్రామంలో ఉన్న కొందరు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు రావటంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఉన్నతాధికారులకు ఎక్కడ తెలుస్తుందోనని రెవెన్యూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. పొసెషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ వయోలేషన్స్‌ భూములకు పరిహారం చెల్లించటంతో పాటు, రికార్డు లను కూడా మార్చి వేయటం పెద్ద నేరం. ఇది ఉన్నతాధికారు లకు తెలిస్తే ఎవరి మీద వేటు పడుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 


కేసరపల్లి భూములు ఈ కోవలోనేనా? 

గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాల కోసం ఎంచుకున్న భూముల వెనుక పెద్ద కథ నడిచిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూములు కూడా చేతులు మారినవేననే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏలూరు కాలువ అవతల, చేరుకోవటానికి కూడా వీలు లేని ప్రాంతంలో పేద ప్రజలకు నివాస యోగ్యంగా లేని భూములను గుర్తించటం వివాదాస్పదంగా మారింది. పైగా ఈ భూములకు అత్యధిక పరిహారాన్ని ప్రకటించడం కూడా ఆరోపణలకు తావిస్తోంది. గుర్తించిన భూముల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నా కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది. నివాసయోగ్యమైన ప్రాంతంలో భూముల యజమానులు ఇంతకంటే తక్కువ ధరకు ఇస్తామన్నా కాదని.. అంతదూరం వెళ్లడం వెనక ఏదో వ్యవహారాలు నడిచాయన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-12-01T06:24:33+05:30 IST