రైళ్ల రిజర్వేషన్‌ ఫుల్‌

ABN , First Publish Date - 2020-04-14T09:25:12+05:30 IST

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారన్న ఆశతో.. ఇప్పటికే విమాన టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడిన విషయం

రైళ్ల రిజర్వేషన్‌ ఫుల్‌

విజయవాడ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారన్న ఆశతో.. ఇప్పటికే విమాన టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రైళ్లలో కూడా భారీస్థాయిలో ముందస్తు రిజర్వేషన్‌ జరిగిపోయింది. ప్రధాన రైళ్లలో బెర్త్‌లు, సీట్లు నిండిపోయాయి. అయితే, లాక్‌డౌన్‌ ఎత్తేసే పరిస్థితి లేకపోవడంతో రిజర్వేషన్ల రద్దు, ఆటో రిఫండ్‌లపై రైల్వే తర్జనభర్జన పడుతోంది. ఈ అంశాలపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌ నుంచి భారీస్థాయిలో రిజర్వేషన్‌లు జరిగాయి.


విజయవాడ నుంచి సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, లింగంపల్లి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, హౌరా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై.. ఇలా డిమాండ్‌ రూట్లన్నీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా ఫుల్‌గా రిజర్వేషన్‌ అయ్యాయి. వెయిటింగ్‌ లిస్ట్‌ లేకపోయినా సీట్లకు అనుగుణంగా రిజర్వేషన్‌ జరిగిపోయింది. లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండటంతో రిజర్వేషన్లను రద్దు చేసి ఆటో రిఫండ్‌ ద్వారా నగదు తిరిగి ఇచ్చే విషయంపై రైల్వేశాఖ ఇంకా స్పష్టతకు రాలేదు.


లాక్‌డౌన్‌ను కొనసాగించడంతో పాటు కొన్ని సడలింపులతో కూడిన మినహాయింపులు ఉండవచ్చుననే ఆశతో అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా, రిజర్వేషన్ల కౌంటర్ల దగ్గర ఎలాంటి బుకింగ్‌ చేపట్టలేదు. కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ జరిగింది. ఒకవేళ మరో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సి వస్తే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కాబట్టి ఆటో రిఫండ్‌ సదుపాయంతో టికెట్ల రద్దు చేసి ప్రయాణికులు చెల్లించిన డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. 

Updated Date - 2020-04-14T09:25:12+05:30 IST