జిల్లాలో మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-05-13T09:16:28+05:30 IST

ప్రభుత్వ బులెటిన్‌ ప్రకారం విజయవాడ కృష్ణలంకలోని రణదివెనగర్‌ ప్రాంతంలో ఒక యువకుడు, జక్కంపూడిలో మరో యువకుడు, భవానీపురంలో 80 ఏళ్ల వృద్ధురాలు, గొల్లపూడిలో మరొకరు కరోనాబారిన పడినట్టు నిర్ధారించారు.

జిల్లాలో మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ప్రభుత్వ బులెటిన్‌ ప్రకారం విజయవాడ కృష్ణలంకలోని రణదివెనగర్‌ ప్రాంతంలో ఒక యువకుడు, జక్కంపూడిలో మరో యువకుడు, భవానీపురంలో 80 ఏళ్ల వృద్ధురాలు, గొల్లపూడిలో మరొకరు కరోనాబారిన పడినట్టు నిర్ధారించారు. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న కృష్ణలంకకు చెందిన మహిళ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణాన్ని ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌లో ధ్రువీకరించింది. దీంతో అధికారికంగా జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 14కు చేరుకోగా.. సాయంత్రానికి అనధికారికంగా మరో తొమ్మిది కేసులు పెరిగాయి. కాగా కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న వారిలో మరో 40 మంది పూర్తిగా కోలుకోవడంతో వారిని వైద్యాధికారులు డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆసుపత్రుల నుంచి కోలుకుని ఇంటికి చేరినవారి సంఖ్య 182కు చేరుకుంది. ఇంకా 150 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


పునరావాస కేంద్రంలో కరోనా కలకలం 

వన్‌టౌన్‌ గాంధీ మున్సిపల్‌ హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో మంగళవారం కరోనా కలకలం సృష్టించింది. మంగళవారం సాయంత్రానికి వైద్యాధికారులు నిర్ధారించిన తొమ్మిది పాజిటివ్‌ కేసుల్లో ఒకరు ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా, మిగిలిన ఎనిమిది మందీ గాంధీజీ మున్సిపల్‌ స్కూలులోని పునరావాస కేంద్రంలో ఉంటున్నవారే. అయితే వారిలో ఐదుగురురిని మాత్రమే అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. ఈ విషయం తెలియగానే ఆ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న నిరాశ్రయులంతా తీవ్ర భయాందోళనలతో బెంబేలెత్తిపోతున్నారు. కొందరైతే అక్కడ ఉండలేమంటూ పారిపోగా... వారిలో కొందరు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.


లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేక.. సొంతూళ్లకు వెళ్లే దారిలేక ఇక్కడే చిక్కుకుపోయిన వలస కూలీలు, రైల్వేస్టేషను, బస్‌స్టేషన్లు, రోడ్ల పక్కన ఉండే అనాథలు, అభాగ్యుల కోసం వన్‌టౌన్‌ లోని గాంధీ మున్సిపల్‌ హైస్కూలు, దాని పక్కనే ఉన్న పెందుర్తి సుందరమ్మ బాలికల ఉన్నత పాఠశాలల్లో విజయవాడ కార్పొరేషన్‌ అధికారులు రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. గాంధీజీ మున్సిపల్‌ స్కూలులో 120 మంది, సుందరమ్మ స్కూలులో 195 మంది ఉన్నారు. వీరందరికీ కార్పొరేషన్‌ సిబ్బంది ఆహారాన్ని అందజేస్తున్నారు.


ఇటీవల వీఎంసీలో అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిలో ఒక వ్యక్తే పునరావాస కేంద్రాల్లో ఉన్నవారందరికీ భోజనాల ప్యాకెట్లు సరఫరా చేసేవారు. ఈ నేపథ్యంలోనే పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో గాంధీజీ మున్సిపల్‌ హైస్కూలులోని పునరావాస కేంద్రంలో ఉన్న వారిలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. వీరిలో ఐదుగురిని మాత్రమే మంగళవారం పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు.   

Updated Date - 2020-05-13T09:16:28+05:30 IST