క్రైం డౌన్‌!

ABN , First Publish Date - 2020-12-30T06:13:30+05:30 IST

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య జిల్లాలో తగ్గిందని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.

క్రైం డౌన్‌!

జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుదల

ఈ ఏడాది నమోదైన కేసుల సంఖ్య 8,877

పేకాట, కోడిపందేలు,గుట్కా, మద్యం కేసులు 9,626

రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గాయి

పరివర్తన కార్యక్రమానికి స్కోచ్‌ అవార్డు

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :

  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య జిల్లాలో తగ్గిందని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018, 2019 సంవత్సరాలతో పోలిస్తే 2020లో జిల్లాలో నేరాల సంఖ్య వివిధ విభాగాల్లో 45 శాతం మేర తగ్గిందన్నారు. కరోనా సందర్భంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో పోలీసులు 22 వేల మంది వలస కార్మికులను ఆదుకుని ప్రజల సహకారంతో ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు చేర్చారన్నారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా కాపుసారా తయారీని వీడిన వెయ్యి కుటుంబాల్లోని 4,500 మందికి ఉపాఽధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో 1410 మంది వీధి బాలలను బడిలో చేర్పించామన్నారు. ఏపీలో చేపట్టిన పరివర్తన కార్యక్రమానికి స్కోచ్‌ అవార్డు దక్కిందన్నారు. గ్రామ రక్షక దళాల కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో గవర్నెస్‌ ఇండియన్‌ పోలీస్‌ అవార్డును జిల్లా పోలీ్‌సశాఖ దక్కించుకుందన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..

ఈ ఏడాది 8,877 కేసుల నమోదు

ఈ ఏడాది జిల్లాలో 8,877 కేసులు నమోదయ్యాయి. 2019లో 9,767 కేసులు నమోదయ్యాయి. 478 చోరీ కేసులు నమోదు కాగా రూ.3.52 కోట్ల విలువైన నగదు, వస్తువులు దొంగిలించబడ్డాయి. వీటిలో రూ.1.89 కోట్లు రికవరీ అయ్యాయి. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనల కేసులు జిల్లాలో 3,726 నమోదు కాగా వీటిలో 3,496 కేసులు పరిష్కారమయ్యాయి.  223 కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది భౌతిక దాడులకు సంబంధించిన కేసులు 1340, ఆస్తి సంబంధిత కేసులు 478, మహిళలపై దాడులకు సంబంధిత కేసులు 1229, రహదారి ప్రమాదాలు 735, వైట్‌కాలర్‌  నేరాలపై కేసులు 430 నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య తక్కువ.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు 9,626  

పోలీస్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది 9,626 కేసులను నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, కోడిపందేల శిబిరాలపైౖ దాడులు చేసి 12,712 మందిని అరెస్ట్టు చేసి వారి నుంచి రూ.1.85 కోట్లు, 1005 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. 777 గుట్కా కేసులు నమోదు చేసి 1129 మందిని అరెస్టుచేసి, రూ.3.30 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వ, రవాణాపై 149 కేసులు నమోదు చేసి, 313 మందిని అరెస్ట్టు చేశారు. రూ.1.21 కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 101 వాహనాలను సీజ్‌ చేశారు. 44 గంజాయి కేసుల్లో 141 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.17.02 లక్షల విలువైన 579 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

 నాటుసారా, మద్యం అక్రమాలపై నిఘా 

  నాటుసారా తయారీ, జిల్లా సరిహద్దుల నుంచి మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఈ విభాగంలో 6,011 కేసులు నమోదు చేసి, 8,962 మందిని మా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5.51 కోట్ల విలువైన 2,76,885 మద్యం సీసాలు, 9,181 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు, 2,878 వాహనాలను సీజ్‌ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించి 397 కేసులు నమోదు చేసి 889 మందిని అదుపులోకి తీసుకుని 5,350 టన్నుల ఇసుకను సీజ్‌ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 571 వాహనాలను సీజ్‌ చేశారు. 

దోపిడీలు, దొంగతనాల కేసుల తగ్గుదల 

 జిల్లాలో 2019లో 9 దోపిడీ కేసులు నమోదు కాగా, 2020లో 5 కేసులు నమోదయ్యాయి. దొంగతనం కేసులు 2019లో 720 నమోదు కాగా, 2020లో 478 నమోదయ్యాయి. రాత్రిపూట దొంగతనాల కేసులు 2019లో 45 నమోదు కాగా ఈ ఏడాది 31 కేసులు నమోదయ్యాయి. దొంగతనాలు తగ్గించేందుకు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశాం. ఏదైనా పనిపై ఇల్లు విడిచి వెళితే ఎల్‌హెచ్‌ఎస్‌ పరికరాలను ఇంటిలో అమర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాం. గ్రామ రక్షణదళాల నిఘా.. ప్రతి గ్రామంలోనూ ఉండటంతో దొంగతనాల కేసులు తగ్గాయి. అత్యాచార కేసులు 2019లో 88 నమోదుకాగా, 2020లో 77 నమోదయ్యాయి.

రహదారి ప్రమాదాల్లో తగ్గిన మరణాలు

 రహదారి ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఈ ఏడాది 256గా నమోదుకాగా, 2019లో 301 కేసులు నమోదయ్యాయి. 2019లో మరణాలు సంభవించిన రోడ్డు ప్రమాదాలు 659 నమోదు కాగా, ఈ ఏడాది 479గా నమోదయ్యాయి. 2019లో 49 హత్యలు జరగ్గా, ఈ ఏడాది 28 హత్య కేసులు నమోదయ్యాయి. హత్యకేసుల్లో 43 శాతం తగ్గుదల కనిపించింది. 

సిబ్బందికి పదోన్నతులు   

  ఈ ఏడాది కాలంలో 60 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా(హెచ్‌సీ), 73మంది హెచ్‌సీలకు ఏఎస్సైలుగా, 20 మంది ఏఎస్సైలకు, ఎస్సైలుగా పదోన్నతులు కల్పించాం. నూతన సంవత్సరంలో పోలీస్‌ శాఖ సమర్థవంతంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళలు, పిల్లలు, బలహీనవర్గాల భద్రతను పెంచేదిశగా అడుగులు వేస్తాం.  రహదారి భద్రతా ప్రమాణాలు పెంచడంతోపాటు,  ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణ కోసం పనిచేస్తూ,  శాంతి భద్రతలను కాపాడుతాం. పోలీసుల సంక్షేమంపై దృష్టిసారిస్తాం. ఈ సమావేశంలో  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీ వకుల్‌జిందల్‌ ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T06:13:30+05:30 IST