డోర్‌ డెలివర్రీ

ABN , First Publish Date - 2020-12-20T05:32:05+05:30 IST

డోర్‌ డెలివర్రీ

డోర్‌ డెలివర్రీ

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్‌ సాధ్యమేనా? 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జనవరి 1 నుంచి రేషన్‌ డోర్‌ డెలివరీ చేపట్టేందుకు ఒకపక్క అధికార యంత్రాంగం సిద్ధమవుతుండగా, మరోపక్క ఇది సాధ్యమేనా? అనే సందేహం కలుగుతోంది. అనేక రకాల సమస్యలను అధిగమించి డోర్‌ డెలివరీ చేయడానికి పది రోజుల సమయం సరిపోతుందో లేదోనన్న సందిగ్ధం అధికారులను వెన్నాడుతోంది. 

సమస్యలివీ..

- ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టిన విధానం వేరు. ప్యాకింగ్‌ చేసి వాటిని కార్డుదారులకు అందించే విధానమది. ఇప్పుడు అలా కాదు. బియ్యం బస్తాలను కార్డుదారుల ఇంటి ముందుకు తీసుకెళ్లి తూకం వేసి ఇవ్వాలి. ఇది సాధ్యమయ్యే పనేనా అనే సందిగ్ధం. 

- రేషన్‌ ఇంటింటికీ తీసుకెళ్లేందుకు జిల్లాకు 815 వాహనాలను కేటాయించారు. ఇది కూడా అనధికారికమే. అయితే, ఈ వాహనాలకు పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వాహనాలను మరో అవసరాలకు వినియోగించే అవకాశం లేదు కాబట్టి, ఆదరణ తక్కువగా ఉందని తెలుస్తోంది. అతికష్టంమీద లబ్ధిదారులను ఎంపిక చేసినా ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడరో తెలియని పరిస్థితి. 

- మినీ ట్రక్‌ వాహనానికి బాడీ చేయించారు. దీని ఖరీదు రూ.5.81 లక్షలు. ఈ వాహన ఖర్చులో 60 శాతం ప్రభుత్వం ఇస్తుందని అంటున్నారు. మరో 30 శాతం బ్యాంకుల నుంచి రుణం వస్తుందని, కేవలం పదిశాతం లబ్ధిదారుడు తన వాటాగా భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే, నాలుగైదు చౌక డిపోలకు ఒక వాహనాన్ని కేటాయించటం వల్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంటోంది. 

ఫ 15 రోజుల పాటు గొడ్డుచాకిరీ చేయాల్సి ఉంటుంది. మిగతా 15 రోజుల్లో ఆ వాహనాన్ని ఇతర కార్యకలాపాల కోసం ఉపయోగించే వీలుండదు. ఇలాంటపుడు తమకు నష్టమేనని దరఖాస్తు చేసుకున్న వారు చెబుతున్నారు. కొంతమంది సిద్ధంగా లేకున్నా అధికారులు శనివారం హడావుడిగా లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించేశారు. 

- హమాలీల నియామకం జరగలేదు. బస్తాలను ఎత్తి వాహనాల్లో ఉంచేది ఎవరన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇంటింటికీ వెళ్లే క్రమంలో బియ్యం తూకం వేసేది ఎవరన్నది కూడా తెలియని పరిస్థితి. 

- ఇంటింటికీ మ్యాపింగ్‌కు సంబంధించిన ప్రక్రియలో వలంటీర్ల పరిధిలో రైస్‌కార్డుల మ్యాపింగ్‌ జరగలేదు. రేషన్‌ డిపోలకు సంబంధించిన మ్యాపింగ్‌ ప్రక్రియ జరిగిందో, లేదో కూడా తెలియదు. 

- ఈ నూతన డోర్‌ డెలివరీ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇంకా ఎక్కడా నిర్వహించలేదు.

Updated Date - 2020-12-20T05:32:05+05:30 IST