‘రాజధాని విషాదం’ డాక్యుమెంటరీ ప్రదర్శన

ABN , First Publish Date - 2020-12-11T06:23:00+05:30 IST

‘రాజధాని విషాదం’ డాక్యుమెంటరీ ప్రదర్శన

‘రాజధాని విషాదం’ డాక్యుమెంటరీ ప్రదర్శన

విజయవాడ సిటీ : కొత్త రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రాజధాని ఇదీ.. అని చెప్పలేని దుస్థితిలో రాష్ట్ర పరిస్ధితులు ఉన్నాయని ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా రాజధాని కోసం తిరుగుతూనే ఉండాలా? ఈ అన్వేషణ సమాప్తం కాదా? దీనిని ఎవరు పరిష్కరించాలి.. అనే ప్రశ్నలు తొలిచేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజధాని విషాదం’ అనే పేరుతో ఆయన రూపొందించిన  డాక్యుమెంటరీని స్థానిక ఎంబీ భవన్‌లో గురువారం ప్రదర్శించారు. అనంతరం పరకాల మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో అన్ని వర్గాల ప్రజల్లో కూలంకషమైన చర్చ జరగాలన్నారు. రైతుల పోరాటంపై ప్రభుత్వం స్పందించకపోవడం సరైనది కాదన్నారు. మూడు రాజధానుల అంశంపై మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ఈ దిశగా ప్రయత్నంలో భాగంగానే ఈ డాక్యుమెంటరీ రూపొందించినట్టు చెప్పారు. అమరావతినే పరిపాలనా రాజఽధానిగా కొనసాగిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్‌, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-11T06:23:00+05:30 IST