మిర్చి రైతులకు వర్షం దెబ్బ

ABN , First Publish Date - 2020-02-12T09:35:18+05:30 IST

మూడేళ్ల నుంచి వరుసగా అకాల వర్షాలు మిర్చి రైతులను చావు దెబ్బతీస్తున్నాయి. కాయలు కోసే తరుణంలో వర్షాలు పడి దెబ్బతీస్తున్నాయి.

మిర్చి రైతులకు వర్షం దెబ్బ

కల్లాల్లోని మిర్చిని కాపాడుకునేందుకు రైతుల పరుగులు

తోటల్లోని కాయలకు నల్లమచ్చలు ఏర్పడి తగ్గుతున్న నాణ్యత


కంచికచర్ల, ఫిబ్రవరి 11: మూడేళ్ల నుంచి వరుసగా అకాల వర్షాలు మిర్చి రైతులను చావు దెబ్బతీస్తున్నాయి. కాయలు కోసే తరుణంలో వర్షాలు పడి దెబ్బతీస్తున్నాయి. వర్షానికి తడవటం వల్ల నల్లమచ్చలు ఏర్పడుతుంటంతో కాయల నాణ్యత పూర్తిగా పడిపోతున్నది. తీవ్రంగా నష్టపోయే దుస్థితి దాపురించటంతో రైతులు అల్లాడుతున్నారు. 


మెట్ట ప్రాంతంలో ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో పైగా రైతులు మిర్చి సాగు చేశారు. ఎకరానికి లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. కొద్ది రోజుల నుంచి మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కల్లాల్లో మిర్చి ఆరబోసి ఉంది.  నాలుగు రోజుల నుంచి పడుతున్న అకాల వర్షాల వల్ల రైతులకు కంటి మీద కునుకు కరువైంది.  పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తున్నది. మంగళవారం సాయంత్రం నందిగామ ప్రాంతంలో ఆకాశం ఒక్కసారిగా చీకట్లు కమ్ముకుని వర్షం పడింది. చినుకు పడితే రైతులు విలవిలలాడిపోతున్నారు. కాయలు తడవకుండా కాపాడుకు నేందుకు కల్లాల వద్దనే టార్ఫాలిన్‌ పట్టాలతో  రైతులు రేయింబవళ్లు పడిగాపులు పడుతున్నారు. వర్షానికి కాయలు తడిస్తే దెబ్బతింటాయి. ఎర్ర కాయలు, తాలు కాయలుగా మారతాయని రైతులు చెపుతున్నారు. 


 తడిసిన కాయలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించదు. వర్షం పుణ్యమా అంటూ తోటల్లోని కాయలు కూడా దెబ్బతింటున్నాయి. కోయాల్సిన కాయలు తడవటం వల్ల నల్ల మచ్చలు వస్తున్నాయి. కాయ నాణ్యత తగ్గిపోతున్నది. మచ్చలు ఉన్న కాయలు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదు. తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు చెపుతున్నారు. గత మూడేళ్ల నుంచి వరుసగా అకాల వర్షాలు మిర్చి రైతులను చావుదెబ్బతీస్తున్నాయి. 

Updated Date - 2020-02-12T09:35:18+05:30 IST