క్వారంటైన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-04-26T09:12:54+05:30 IST

నగర సమీపంలో ఏర్పాటుచేసిన ఓ క్వారంటైన్‌..

క్వారంటైన్‌ కష్టాలు

ముగ్గురు నలుగురికి ఒకే రూమ్‌

15-20 మందికి ఒకే బాత్‌రూమ్‌

ప్రైమరీ కాంటాక్టులతోనే సెకండరీ కాంటాక్టులూ..

నాసిరకం ఆహారం ఇస్తున్నారని బాధితుల గగ్గోలు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘‘మేము భవానీపురంలో ఉంటాం. మా ఇంటి యజమానికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన ఇంట్లో కింద పోర్షన్‌లో ఉంటున్న నన్ను, నా భర్త, 15 ఏళ్ల మా అబ్బాయిని ఈనెల 22న నగర సమీపంలో క్వారంటైన్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఇంటి వద్ద బయల్దేరేటప్పుడు రెండు రోజుల్లో పంపేస్తామని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడికొచ్చాక మమ్మల్ని ఉంచిన రూమ్‌ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొన్ని రోజులుగా శుభ్రంచేసిన దాఖలాల్లేవు.


ఒక్కో రూమ్‌లో ముగ్గురు నలుగురిని ఉంచుతున్నారు. 15-20 మందికి ఒకే బాత్‌రూమ్‌. ఇచ్చే ఆహారం కూడా అధ్వానంగా ఉంటోంది. శనివారం ఉదయం 9.30కు టిఫిన్‌గా రెండు చిన్న పూరీలు ఇచ్చారు. మా ఆయనకు షుగర్‌ ఉంది. అది సరిపోదు. పోనీ మధ్యాహ్నమైనా ఆహారం పెట్టారా అంటే అదీ లేదు. మధ్యాహ్నం 2.30కు ఉడికీ ఉడకని ఆహారం ప్యాకెట్లు టేబుల్‌పై పడేసి పోయారు. సాంబారులో పురుగులు వచ్చాయి. మూడు రోజులుగా గొడవ పెడుతుంటే చివరికి ఒక శానిటైజర్‌, మాస్కు ఇచ్చారు. ఇక్కడ పరిస్థితి చూస్తే మాకూ కరోనా వస్తుందన్న భయం కలుగుతోంది.’’

- విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో మహిళ ఆవేదన ఇది. 


జిల్లాలో కరోనా అనుమానితులను ఉంచేందుకు 34 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో శనివారం నాటికి 739 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామని మంత్రులు, అధికారులు చెబుతున్నా చాలా కేంద్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. శనివారం పలువురు బాధితులు క్వారంటైన్‌ కేంద్రాల్లో తాము పడుతున్న ఇబ్బందులను ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ దృష్టికి తెచ్చారు. వీడియోలు రికార్డు చేసి పంపారు.


నగర సమీపంలో ఏర్పాటుచేసిన ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో శనివారం 95 మందిని ఉంచారు. అక్కడ గదుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, పురుగులు ఉన్న నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నారని బాధితులు వాపోయారు. ‘ఒక్కో రూమ్‌కు ముగ్గురు నలుగురు ఉంటున్నారు. మూడు నాలుగు రూమ్‌లకు ఒక బాత్‌రూమ్‌ ఇస్తున్నారు. ఉదయం 9.30కు కానీ టిఫిన్‌ ఇవ్వడం లేదు. మధ్యాహ్నం 2.30కు అన్నం పెడుతున్నారు. ఆహారం నాసిరకంగా ఉంటోంది. మమ్మల్ని తీసుకొచ్చాక మూడు రోజులు సాయంత్రం పూట ఏమీ ఇచ్చేవారు కాదు. గొడవ పడితే నాల్గోరోజు రెండు కర్జూరాలు, మూడు జీడిపప్పులు, మూడు బాదం పప్పులు ఇచ్చారు. రాత్రి 9.30కు ఆహారం వస్తుంది. అది కూడా నాసిరకంగా చల్లారిపోయి ఉంటోంది. గదులు కానీ, బాత్‌రూమ్‌లు కానీ శుభ్రం  చేయడం లేదు. గొడవ చేస్తే ఓ మనిషిని తీసుకొచ్చి గదులను శుభ్రం చేస్తున్నట్లు ఫొటోలు తీసుకుని వెళ్లారు.’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం  చేశారు. 


ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు ఒకేచోట 

ప్రైమరీ కాంటాక్టులను, సెకండరీ కాంటాక్టులను ఒకేచోట ఉంచేస్తున్నారన్నది క్వారంటైన్‌ సెంటర్లపై ఉన్న మరో ప్రధాన ఆరోపణ. భవానీపురంలో పాజిటివ్‌ వచ్చిన ఓ న్యాయవాది ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఈనెల 22న సమీపంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు.


వన్‌టౌన్‌ బ్రాహ్మణ వీధిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి మృతిచెందిన వృద్ధురాలి భర్తను కూడా అదేరోజు ఇదే క్వారంటైన్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఈయన ప్రైమరీ కాంటాక్టు కాగా, ఈయనతో పాటే న్యాయవాది ఇంట్లో అద్దెకు ఉండే సెకండరీ కాంటాక్టులూ ఉన్నారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. అందరూ కలిసే ఆహారం తీసుకోవడం, ఒకే బాత్‌రూమ్‌ వాడుకోవడం చేస్తున్నారు. 


ఇంటి నుంచే కష్టాలు

వన్‌టౌన్‌లో పాలబూతు నడిపే ఇద్దరు దంపతులను క్వారంటైన్‌కు తరలించారు. వారి ఇంటి సమీపంలో ఓ వృద్ధురాలు కరోనాతో చనిపోయింది. ఆమె భర్త వీరి దగ్గర పాలప్యాకెట్లు కొనుగోలు చేశారన్న కారణంతో వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఇంటి నుంచి ఓ బస్సులో క్వారంటైన్‌కు తీసుకొచ్చారు. ‘ఆ బస్సులో మాతోపాటు 49 మంది ఉన్నారు. వారిలో ఎవరికి వైరస్‌ ఉన్నా అందరం బాధితులుగా మారుతామని చెప్పినా మా మాట వినలేదు.’ అని ఆ దంపతులు వాపోయారు. క్వారంటైన్‌ కేంద్రంలో 96 మందిని ఒకే బ్లాక్‌లో ఉంచారని, అందరికీ  కలిపి నాలుగైదు బాత్‌రూమ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. 


వసతులు మెరుగుపరచాలి

గన్నవరం క్వారంటైన్‌ సెంటర్‌లో వసతులు సరిగ్గా లేవు. నాసిరకం ఆహారం ఇస్తున్నారని బాధితులు కన్నీరుపెడుతున్నారు. 24 గంటల్లో గన్నవరం క్వారంటైన్‌ సెంటర్‌లో వసతులు మెరుగుపరచాలి. క్వారంటైన్‌ కేంద్రాలు కరోనా నియంత్రణ కేంద్రాలుగా ఉండాలే తప్ప కరోనా వ్యాప్తిచేసేలా కాదు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. సామాజిక వ్యాప్తి పెరుగుతున్నా చర్యలు చేపట్టడం లేదు. 

- పోతిన వెంకట మహేశ్‌, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Updated Date - 2020-04-26T09:12:54+05:30 IST