కార్డు ఎంత కష్టమో!

ABN , First Publish Date - 2020-07-08T09:58:17+05:30 IST

కొత్త రైస్‌ కార్డుల ఆంక్షలు లబ్ధిదారుల ఆశలపై..

కార్డు ఎంత కష్టమో!

బియ్యం కార్డుల కోసం అర్హుల నిరీక్షణ

వెసులుబాట్లు కొన్నే.. ఆంక్షలెన్నో

ఆప్షన్‌ ఇచ్చినా.. లేదంటున్న సచివాలయాలు 

పేరు తొలగించుకోవాలంటే ఎన్ని కష్టాలో


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కొత్త రైస్‌ కార్డుల ఆంక్షలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. బియ్యం కార్డును ఆదాయానికి ప్రామాణికంగా తీసివేయటంతో నిత్యావసరాలను అందించే కార్డుగానే ఉపయోగపడుతోంది. పాత రేషన్‌ కార్డుల్లో ఉమ్మడిగా ఉండి, తర్వాత వేరు పడిన అర్హులు తమ పేరు వేరు చేయించుకోవాలంటే తల ప్రాణం తోకకు వస్తోంది. దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డు పది రోజుల్లోనే ఇంటికి వస్తుందని ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ చిన్న విషయాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావటం లేదు. 


కొత్త బియ్యం కార్డుల కోసం పాత కార్డుల నుంచి తమ పేరు వేరు చేయించుకోవాలనుకునే అర్హులకు నెలలు గడుస్తున్నా సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది. ఇందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అవగాహన లేని సిబ్బంది ఇలాంటివి చేయటం లేదని చెబుతుండటంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి కుటుంబాల్లో ఉండి, ఆ కుటుంబ కార్డులో పేరు నమోదై ఉన్న వారు, ఇప్పుడు తమ పేరు వేరు చేయించుకోవాలంటే సమస్య ఏర్పడుతోంది. 


ఒక కుటుబంలో పాత కార్డులో తల్లిదండ్రులతో పాటు కుమార్తె కూడా ఉంది. తర్వాత కుమార్తెకు పెళ్లి అయినా, పాత కార్డులోనే పేరు కొనసాగుతోంది. ఆమె ఉద్యోగం చేస్తూ ఆదాయపుపన్ను చెల్లించాల్సి వస్తే.. కార్డులో ఆమె పేరు ఉన్నందున తల్లిదండ్రులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. కొత్త రైస్‌ కార్డుకు తల్లిదండ్రులు కూడా అనర్హతకు గురి అవుతున్నారు.


వాస్తవానికి కూతురి ఆదాయం తండ్రికి రాదు. కానీ, తల్లిదండ్రులతో పాటు కూతురు పేరు ఉండటం వల్ల ఈ సమస్య వచ్చింది. దీనిని స్ప్లిట్‌ చేయించుకోవాలంటే కుమార్తె పేరును తొలగించాలి. ఈ ఆప్షన్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. లేదని సచివాలయాల సిబ్బంది అంటున్నారు. మరో  కుటుంబంలో అమ్మాయికి పెళ్లయింది. భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివసిస్తోంది. వారికి కార్డు కావాలి. ఆమె పేరు తల్లిదండ్రుల కార్డులోనే ఉంది. నిబంధనల ప్రకారం ఆ కార్డులో అమ్మాయి పేరును తొలగించుకోవాలి.


తర్వాత అమ్మాయి పేరును భర్త, వారి తల్లిదండ్రుల కుటుంబంలోకి యాడ్‌ చేయాలి. ఆ తర్వాత వారు వేరుగా ఉంటున్నట్టు చేయించుకోవాలి. ఇదంతా ఒక చైన్‌ లింక్‌. పది రోజుల్లో అయ్యే పని కాదు. ఈ పని కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయినా పనులు జరగటం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒంటరి మహిళలకు కష్టాలు ఎన్నో. వీరు విడాకులు తీసుకున్నట్టు కోర్టు నుంచి స్పష్టంగా తీర్పు వచ్చినా.. సచివాలయాల్లో మాత్రం స్ప్లిట్‌ చేయటానికి అంగీకరించటం లేదు. ఆప్షన్‌ లేదంటున్నారు. ఆప్షన్‌ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.


అర్హులు కార్యాలయాల చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. ఇక ఒంటరిగా నివసించేవారు అర్హత ఉన్నా రైస్‌ కార్డులను పొందలేకపోతున్నారు. ఈ సమస్యలపై  ప్రభుత్వం తక్షణం గ్రామ, వార్డు సచివాలయాలకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2020-07-08T09:58:17+05:30 IST