పుల్లూరు-2 టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

ABN , First Publish Date - 2020-03-13T10:44:52+05:30 IST

పుల్లూరు- 2 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా వజ్రాల కుమారరెడ్డి వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు.

పుల్లూరు-2 టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

హైకోర్టు కొట్టివేసిన కేసును సాకుగాచూపిన రిటర్నింగ్‌ అధికారి

ఆర్డీవోకు అప్పీల్‌ చేయనున్న అభ్యర్థి కుమారరెడ్డి

రిటర్నింగ్‌ అధికారిపై హైకోర్టుకు వెళతామంటున్న నాయకులు


పుల్లూరు(మైలవరం రూరల్‌), మార్చి 12: పుల్లూరు- 2 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా వజ్రాల కుమారరెడ్డి వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. కుమారరెడ్డి నామినేషన్‌లో హైకోర్టు కేసు వివరాలను నమోదు చేయాలేదని, కోళ్ళఫారంలకు సంబంధించి 2016 ఇంటి పన్నులు చెల్లించలేదనే కారణాలు చూపుతూ నామినేషన్‌ను రిజక్ట్‌ చేశారు. చిలుకూరువారిగూడెంకు చెందిన వజ్రాల కుమారరెడ్డి 2006 నుంచి పుల్లూరు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2008వ సంవత్సరంలో పంచాయతీ నిధుల ఖర్చులకు సంబంధించి బిల్లులు చూపించలేదని ఆరోపిస్తూ అప్పటి జిల్లా కలెక్టర్‌ రూ.4 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో కుమారరెడ్డి తనమీద ఎటువంటి విచారణ జరపకుండా నిధులు దుర్వినియోగం అయినట్లు నోటీసులివ్వడమేంటని హైకోర్టులో పిటిషన్‌ వేశారు.


అనంతరం హైకోర్టు ఆయనకు స్టే ఇవ్వడానికి కొన్ని డైరెక్షన్‌లు ఇచ్చింది. రూ.4లక్షలు దుర్వినియోగం అయినట్లు అధికారులు చెబుతున్నారు కాబట్టి ముందుగా రూ.1.50 లక్షలు డిపాజిట్‌ చేయమని హైకోర్టు చెప్పడంతో ఆయన ప్రభుత్వానికి నగదును డిపాజిట్‌ చేశారు. అనంతరం హైకోర్టు కలెక్టర్‌ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ అంశంపై సుమారు 10 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. అనంతరం 25-10- 2018న హైకోర్టు కలెక్టర్‌ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై హైకోర్టు కలెక్టర్‌కు కొన్ని డైరెక్షన్‌లు సైతం ఇచ్చింది. ఆరునెలల్లో విచారణ చేసి నిధులు దుర్వినియోగం అయినట్లు రుజువు అయితే పిటిషన్‌ వేయాలని పేర్కొంది. కానీ అధికారులు ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. కుమారరెడ్డిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉందని వైసీపీ నాయకులు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చే శారు.


ప్రభుత్వానికి ఎటువంటి బిల్లులు చెల్లించాల్సిన  అవసరం లేదని తెలుపుతూ డీఎల్పీవో నుంచి నో డ్యూస్‌ లెటర్‌ తీసుకువస్తే నామినేషన్‌ను ఒకే చెస్తామని కుమారరెడ్డికి చెప్పారు. ఈ అంశంపై ఆర్డీవోకు అప్పీల్‌ చేయనున్నట్టు టీడీపీ అభ్యర్థి కుమారరెడి ్డ తెలిపారు. అంతేకాకుండా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నామినేషన్‌ను తిరస్కరించిన రిటర్నింగ్‌ అధికారిపై హైకోర్టులో న్యాయం కోసం పోరాడతామన్నారు. కోళ్ళఫారాలకు శిస్తులు కట్టనవసరం లేదని 1994లోనే జీవో వచ్చిందని, తనపై ఎన్నికల్లో గెలవలేక, తనను పోటీలో నుంచి తప్పించేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని కుమారరెడ్డి ఆరోపించారు.  

Updated Date - 2020-03-13T10:44:52+05:30 IST