సపోర్టు ఏదీ..?

ABN , First Publish Date - 2020-07-28T09:44:20+05:30 IST

బందరు పోర్టు పనులకు గ్రహణం వీడట్లేదు. పనుల ప్రారంభానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.

సపోర్టు ఏదీ..?

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : బందరు పోర్టు పనులకు గ్రహణం వీడట్లేదు. పనుల ప్రారంభానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. కరోనా కారణంగా ఐదారు నెలలుగా పోర్టు పనులు ప్రారంభించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నర నెలల వ్యవధిలోనే  బందరు పోర్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ  నిర్ణయం తీసుకుంది. దీంతో పనులు నాలుగు అడుగులు వెనక్కి పడినట్లయింది.


  2,250 ఎకరాల్లో రూ.4,500 కోట్లతో మొదటి విడతగా నాలుగు నుంచి ఆరు బెర్తులతో బందరు పోర్టు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వమే బందరు పోర్టును నిర్మించి ఆదాయాన్ని సమకూర్చు కుంటుందనే వాదన కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన  రైట్స్‌ సంస్థ ద్వారా పోర్టు నిర్మాణానికి ఎంతమేర వెసులుబాటు ఉంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సర్వే చేయించింది. పోర్టు నిర్మించే ప్రాంతంలో కట్టడాలు నిలబడతాయా, లేదా అనే అంశంపై  రైట్స్‌ సంస్థ ద్వారా రూ.26లక్షల వ్యయంతో భూసార పరీక్షలు చేయించారు. 


ప్రభుత్వమే పోర్టు నిర్మిస్తుందా..?

సాగరమాల పథకంలో భాగంగా రాష్ట్రంలో ఒక పోర్టును కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించాలనే ప్రణాళిక ఉంది. బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుందని పాలకులు సూచనప్రాయంగా చెబుతున్నారు. టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టరుకు అప్పగించి అనంతరం ప్రభుత్వమే ఈ పోర్టును నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు పాలకుల మాట.  అయితే, ఈ పనులకు సంబంధించి టెండర్లు ఎప్పుడు పిలుస్తారు, టెండర్ల ప్రక్రియ ఎప్పటికి పూర్తిచేస్తారు, ఎప్పటికి పనులు ప్రారంభిస్తారనే అంశంపై  స్పష్టతలేని స్థితి ఏర్పడింది.


కరోనా సమయంలో బందరుపోర్టు అంశాన్ని ప్రభుత్వం అసలు పట్టించుకుంటుందా అనే విషయంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. పోర్టు నిర్మాణం కోసం 2008లోనే ఒప్పందం జరిగింది. అప్పట్లో గిలకలదిండి హార్బర్‌ సమీపంలోని 412 ఎకరాల పోర్టు భూములను తొలివిడతగా కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు.  పోర్టు  నిర్మాణం కోసం భూములు అప్పగించడం ఆలస్యమైంది.  దీంతో  కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించకుండా పదేళ్లు జాప్యం చేసింది. 


బందరుపోర్టువైపు బడా సంస్థల దృష్టి

బందరు పోర్టు నిర్మాణంపై బడా సంస్థలు దృష్టి సారించాయనే ప్రచారం జరుగుతోంది.  నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులోని అధికశాతం వాటాను ఆదానీ గ్రూపు ఇటీవల దక్కించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బందరుపోర్టు పనులను కూడా ఇదే సంస్థకు అప్పగించే అవకాశాలు అధికంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అంబానీ గ్రూపు తదితర సంస్థలు బందరుపోర్టు పనులను దక్కించుకునేందుకు తెరవెనుక  మంత్రాంగం నడుపుతున్నట్లు  సమాచారం. తెలంగాణకు కాస్త దగ్గరలో ఉన్న బందరుపోర్టుపై  ఆ  ప్రభుత్వ దృష్టి కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణాకు బందరుపోర్టును అప్పగిస్తారనే అంశంపై రాజకీయ దుమారం గతంలో చోటుచేసుకుంది. 


ముడా చైర్మన్‌,  వీసీ నియామకాలు ఎప్పుడో..

బందరు పోర్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా)ను ఏర్పాటుచేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముడా చైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ముడా వీసీ విల్సన్‌బాబు రెండు నెలల క్రితం పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ముడా ద్వారానే పోర్టుకు అవసరమైన భూ సేకరణ, నమూనాలు తదితరాలను తయారు చేశారు. ముడా చైర్మన్‌,  వీసీ పదవులు భర్తీ అయితే ప్రభుత్వ పెద్దలతో తరచూ పోర్టు అంశంపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-28T09:44:20+05:30 IST