ఏది నిజం?.. దాడి జరిగిన రోజంతా మంత్రి వెంటే నిందితుడు
ABN , First Publish Date - 2020-12-05T06:24:32+05:30 IST
మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో మరోసారి మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు.
మంత్రిపై దాడి ఘటనలో విచారణ పక్కదారి
మరి పోలీసులను, మంత్రి అనుచరులను విచారించరా?
దాడికి ఇసుక కొరత కారణమన్నందుకు మాజీ మంత్రికి వేధింపులు
విచారణకు స్టేషన్‌కు రావాలంటూ డీఎస్పీ నుంచి పిలుపు
దాడి ఘటనకు రాజకీయ రంగు?
అసలు కారణాన్ని మరుగునపర్చేందుకు యత్నం
మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో మరోసారి మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిని కేసులతో వేధించడం ద్వారా ఆయన్ను రాజకీయాలకు దూరం చేయాలన్నది అధికారపార్టీ నేతల వ్యూహం. మంత్రి నాని సన్నిహితుడు మోకా భాస్కరరావు హత్య కేసులోనూ కొల్లు రవీంద్రను ఏ4గా ఇరికించారన్న ప్రచారం ఉంది. తాజాగా మంత్రిపై జరిగిన దాడి వ్యవహారంలోనూ రవీంద్రనే నిందితుడిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సైతం ఈ రాజకీయ క్రీడలో భాగస్వాములై వాస్తవాలను మరుగునపర్చే ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మంత్రిపై దాడి ఘటనకు సంబంధించి బుధవారం పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసు ఇచ్చారు. దాడికి ఇసుక కొరతే కారణం అని ఏ ఆధారాలతో మీడియా వద్ద వ్యాఖ్యానించారో తెలపాలని అందులో పేర్కొన్నారు. దీనికి రవీంద్ర లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తిరిగి శుక్రవారం ఇనకుదురుపేట సీఐ నేరుగా రవీంద్ర ఇంటికి వచ్చారు. డీఎస్పీ రమ్మంటున్నారంటూ తెలిపారు. తనకు గతంలో ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చానని, మళ్లీ ఎలాంటి నోటీసు లేకుండా పిలిస్తే ఎలా వస్తానని రవీంద్ర వ్యాఖ్యానించడంతో హడావిడిగా వెళ్లి, నోటీసుతో వచ్చారు. ఈ పరిణామాలన్నీ కేవలం కక్ష సాధింపులో భాగంగానే కనిపిస్తున్నాయి తప్ప దాడి ఘటనపై విచారణలో పోలీసుల చిత్తశుద్ధిని తెలపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రిపై దాడికి కారణం ఏమిటో తెలుసుకోవడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నది ప్రజల వాదన. దాడికి అసలు కారణాన్ని మరుగునపర్చి, దానికి రాజకీయరంగు పులమడంపైనే పోలీసులు దృష్టి సారిస్తున్నారన్న భావన సాధారణ ప్రజానీకంలో ఉంది. వాస్తవానికి మంత్రిపై దాడి జరిగిన వెంటనే మీడియా దాన్ని మంత్రిపై హత్యాయత్నంగా పేర్కొంటూ హడావిడి చేసింది. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు మంత్రిపై జరిగింది స్వల్ప దాడేనని, దాడికి పాల్పడింది తాపీ మేస్త్రి అని, ఇందుకు ఇసుక కొరతే కారణం కావచ్చని ప్రకటించారు. ఇదే అంశం మీడియాలో రావడంతో రవీంద్ర కూడా అదే వ్యాఖ్యలు చేశారు. అయితే ఇసుక కొరత కారణంగా మంత్రిపై దాడి జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళితే ప్రభుత్వానికి మంచి కాదన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ విషయాన్ని మరుగుపర్చి, రాజకీయ రంగు పులిమేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణంగా కనిపిస్తోంది.
డ్రామానా?
అసలు మంత్రిపై దాడిని ఓ పెద్ద డ్రామాగా వైసీపీ నాయకులే కొందరు పేర్కొంటున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి పేర్ని నాని ప్రభ తగ్గుతోందన్న ప్రచారం ఉంది. తన అనుచరులకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి కార్పొరేషన్ నిధులను సంతర్పణ చేయడం.. మంత్రి అనుచరుల సెటిల్‌మెంట్ల వ్యవహారాలు.. ఇవన్నీ ప్రజల్లో మంత్రిపై వ్యతిరేకతకు దారి తీస్తున్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్న విషయం. ఈ నేపథ్యంలో సానుభూతి కోసం వైసీపీ నాయకులు కొందరు దాడి డ్రామాకు తెరదీశారన్న ప్రచారమూ ఉంది. నిందితుడు బడుగు నాగేశ్వరరావు దాడి జరిగిన రోజు మొత్తం మంత్రి వెంటే తిరగడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. నిందితుడు నిజంగానే టీడీపీ సానుభూతిపరుడైతే మంత్రి అనుచరులు అతన్ని ఎందుకు దూరం పెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. మంత్రి వెంట నిందితుడు తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులను, మంత్రి అనుచరులను ఎందుకు విచారించడం లేదు? మాజీ మంత్రిని మాత్రమే విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం కక్ష సాధింపులో భాగమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.