ఇదేమిటిలా? అక్రమ మద్యం రవాణా కేసుల్లో పోలీసుల ద్వంద్వ వైఖరి

ABN , First Publish Date - 2020-10-03T17:26:25+05:30 IST

జగ్గయ్యపేటలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. తొలుత పాలకమండలి సభ్యురాలి భర్తను నిందితుడిగా చూపిన పోలీసులు ఆ తర్వాత ఆమె కొడుకును నిందితుడిగా చూపారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ఆ కారును పట్టుకున్నారు.

ఇదేమిటిలా? అక్రమ మద్యం రవాణా కేసుల్లో పోలీసుల ద్వంద్వ వైఖరి

బడాబాబులు పట్టుబడితే రాచమర్యాదలు జూ బడుగులైతే రాక్షసంగా హింసిస్తారా?


ఆంధ్రజ్యోతి, విజయవాడ: 


సెప్టెంబరు 30.. జగ్గయ్యపేటలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. తొలుత పాలకమండలి సభ్యురాలి భర్తను నిందితుడిగా చూపిన పోలీసులు ఆ తర్వాత ఆమె కొడుకును నిందితుడిగా చూపారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ఆ కారును పట్టుకున్నారు.


అక్టోబరు 1.. విజయవాడ కృష్ణలంకకు చెందిన అజయ్‌ అనే వ్యక్తిని అక్రమంగా మద్యం రవాణా చేసిన కేసులో ఏ11 నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ కార్గోలో రూ.12 లక్షల విలువైన మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్నది ఆరోపణ. వాస్తవానికి ఈ కేసులో అజయ్‌కు ప్రత్యక్ష పాత్ర లేదు. గుప్తా అన్న పేరు మీద బుక్‌ చేసిన పార్శిల్‌కు అజయ్‌ సెల్‌ఫోన్‌ నంబరును ఇచ్చారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. సాయంత్రానికి అజయ్‌ ఎస్‌ఈబీ పోలీసుస్టేషన్‌లో శవమై మిగిలాడు. 



రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా విషయంలో బడాబాబులకు ఓ నీతి.. బడుగులకు మరో నీతి అమలవుతోందని చెప్పడానికి ఒక్క రోజు తేడాతో జిల్లాలో చోటుచేసుకున్న పై రెండు ఉదంతాలే నిలువెత్తు నిదర్శనాలు. లాక్‌డౌన్‌ సమయంలో ఒక్క నెలలో ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.3 కోట్లు. ఆ అక్రమ వ్యవహారంలో పట్టుబడినవారిలో బడా బాబులు, అధికార పార్టీ ముద్ర ఉన్నవారే ఎక్కువ. వారి విషయంలో ఎస్‌ఈబీ పోలీసులు ఎలా వ్యవహరించారు? మద్యం అక్రమ రవాణాలో కేవలం అనుమానితుడిగా దొరికిన అజయ్‌ విషయంలో ఎస్‌ఈబీ పోలీసులు ఎలా వ్యవహరించారు? ఈ ప్రశ్నలే సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 


ఖరీదైన కార్లలో తెలంగాణ నుంచి ఖరీదైన మద్యం సీసాలను లెక్కకు మించి తీసుకొస్తూ ఎస్‌ఈబీ సిబ్బందికి పట్టుబడిన దొరలు దర్జాగా బయటకు కొచ్చేశారు. చిన్నాచితక వ్యక్తులు నాలుగైదు బాటిళ్లతో పట్టుబడినా వారి పట్ల ఎస్‌ఈబీ పోలీసులు ఎంత దురుసుగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిన సత్యం. సాధారణంగా మద్యం కేసుల్లో పట్టుబడిన వారిపై లాఠీ ఎత్తాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ కేసుల్లో పట్టుబడిన పెద్దలకు సలామ్‌ కొట్టి, ఎలాంటి అండదండ లేని నిందితులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. మద్యం అక్రమ రవాణా కేసులో ఏ11గా ఉన్న అజయ్‌ను అరెస్టు పేరుతో స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు, ఆ తర్వాత ‘ఖాకీ’ విచారణే సాగించారని సమాచారం. ఇదే విషయాన్ని దళిత సంఘాల నాయకులు, అజయ్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ ఎం.సత్తిబాబు సెలవులో ఉన్నారు. అప్పటి నుంచి స్టేషన్‌ వ్యవహారాలను కింది స్థాయి సిబ్బంది చూస్తున్నారు. 


ఏ రోజున ఎంతమందిని అరెస్టు చేశారు? ఎంత సరుకు స్వాధీనం చేసుకున్నారన్న వివరాలను ఫోన్లలో ఉన్నతాధికారులకు  తెలియజేస్తున్నారు. అజయ్‌ను అరెస్టు చేసి, స్టేషన్‌కు తీసుకొచ్చారన్న సమాచారం అతడి మరణం తర్వాతే ఉన్నతాధికారులకు తెలిసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.


అధికార పార్టీ నాయకుల దందా పట్టదా..!

ప్రభుత్వం అడ్డమైన బ్రాండ్లను ప్రజలపై రుద్దడంతోపాటు భారీ ఎత్తున ధరలను పెంచేయడంతో అక్రమ మద్యం రవాణా జోరందుకుంది. ఈ అక్రమ రవాణాలో అధికశాతం అధికార పార్టీ నాయకులే సూత్రధారులుగా ఉంటున్నారు. బందరు, పెడన నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నాటు సారా విచ్చలవిడిగా కాసి, విక్రయిస్తున్నారు. ఇటువైపు చూడటానికే పోలీసులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల నాటు సారా రవాణా చేస్తున్న ఓ హోంగార్డును పోలీసులు పట్టుకున్నారు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధి నుంచి పోలీసులకు ఫోన్‌ వచ్చింది. సదరు హోంగార్డు నా మనిషి అతన్ని వదిలేయండంటూ. వెనువెంటనే సదరు హోంగార్డు ఎలాంటి కేసు లేకుండా బయటకు వచ్చేశాడు. తప్పు చేసిన హోంగార్డును ఏమీ చేయలేక హోంగార్డుల పనితీరు బాగోలేదంటూ పలువురు హోంగార్డులను ఉన్నతాధికారులు ఎడాపెడా బదిలీలు చేసేశారు. 


జూన్‌లో కంకిపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న మంతెన గ్రామ శివారులో సుమారు రూ.40 లక్షల విలువైన అక్రమ మద్యం నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో స్థానిక వైసీపీ నాయకుడు వీరంకి వెంకట రమణను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అతనితోపాటు కొండపల్లి ఆనంద్‌, షేక్‌ మహబూబ్‌ సుభానీ, షేక్‌ రఫీని నిందితులుగా పేర్కొన్నారు. ఈ మద్యం రాకెట్‌ వెనుక నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత, ఆయన ముఖ్య అనుచరుడైన ‘వీరభక్త హనుమాన్‌’, అతని అనుచరుడైన ‘కాకి’ అసలు సూత్రధారులు. కానీ వారెవ్వరినీ పోలీసులు ప్రశ్నించలేదు. లాక్‌డౌన్‌ సమయంలోనే సుమారు రూ.5 కోట్ల విలువైన మద్యాన్ని వీరు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ వీరి నేతృత్వంలో పెనమలూరులో అక్రమ మద్యం దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. 


కంకిపాడు మండలంలోనే లాక్‌డౌన్‌ సమయంలో పంజాబ్‌ నుంచి లారీలో పెద్ద ఎత్తున మద్యం తీసుకొచ్చి పెద్ద పెద్ద గడ్డివాముల్లో భద్రపరిచారు. ఎస్‌ఈబీ పోలీసులు దాడులు చేసి బయటకు తీశారు. డ్రైవర్లను, మరికొంతమందిని అరెస్టు చేశారు. సరుకును రప్పించిన వ్యక్తులు, దానికి డబ్బులు చెల్లించిన వ్యక్తులు సేఫ్‌ జోన్‌లోకి వెళ్లారు. ఎస్‌ఈబీ పోలీసులు మాత్రం లారీ సరుకును స్వాధీనం చేసుకున్నామని గొప్పగా ప్రకటనలు చేశారు. ఈ ముఠా వెనుక కూడా అధికార పార్టీ నేతలు ఉండటంతో వారిని సైడ్‌ చేసి అమాయకులైన డ్రైవర్లు, క్లీనర్లను నిందితులుగా చూపారన్నది వాస్తవం.

Updated Date - 2020-10-03T17:26:25+05:30 IST