ఇథనాల్‌ గోల..గోల!

ABN , First Publish Date - 2020-12-15T06:06:03+05:30 IST

పెట్రోల్‌లో ఇథనాల్‌ మిక్సింగ్‌ వ్యవహారం గోలగోలగా మారుతోంది. చినికి చినికి గాలివానగా మారి జిల్లాలోని పెట్రోలియం డీలర్లు, ఆయిల్‌ కంపెనీల మధ్య జగడానికి దారి తీస్తోంది.

ఇథనాల్‌ గోల..గోల!

పెట్రోల్లో కలవదు.. బండి కదలదు 

వినియోగదారుల ఆగ్రహం.. డీలర్ల ఆందోళన

కల్తీ అంటూ డీలర్లతో వాహనదారుల వాగ్వాదాలు

సమస్యను కంపెనీల దృష్టికి తీసికెళ్లిన డీలర్లు 

స్పందించని కంపెనీలు.. 

ఆయిల్‌ కంపెనీలు వర్సెస్‌ పెట్రోలియం డీలర్లు 

ఇథనాల్‌ మిశ్రమంపై స్వయంగా డీలర్ల ప్రచారం 


పెట్రోల్‌లో ఇథనాల్‌ మిక్సింగ్‌ వ్యవహారం గోలగోలగా మారుతోంది. చినికి చినికి గాలివానగా మారి జిల్లాలోని పెట్రోలియం డీలర్లు, ఆయిల్‌ కంపెనీల మధ్య జగడానికి దారి తీస్తోంది. పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నారంటూ పెట్రోలియం డీలర్లపై వాహనదారులు వాగ్వాదానికి దిగుతుండగా, డీలర్లు.. ఆయిల్‌ కంపెనీలను నిందించటం పెరిగిపోయింది. చివరికి పెట్రోలియం డీలర్లు, ఆయిల్‌ కంపెనీలు పరస్పరం నిందించుకోవడం ఇటీవల ఎక్కువైపోయింది.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లావ్యాప్తంగా రెండు వారాల క్రితం పలు బంకుల్లో పెట్రోల్‌ కొట్టించుకున్న వాహనదారులకు చిత్రమైన అనుభవం ఎదురైంది. స్టార్టింగ్‌లో ఉన్న వాహనం ఒక్కసారిగా ఆగిపోవటంతో, వాహనదారులు పెట్రోల్‌ కల్తీ చేస్తున్నారంటూ ఆయా బంకుల దగ్గర గొడవలకు దిగారు. దాదాపు ఇలాంటి సంఘటనలు వారం రోజులుగా ఏదో ఒక బంకులో నడుస్తూనే ఉన్నాయి. బంకుల నిర్వాహకులకు ఇది తలనొప్పిగా మారింది. దీంతో బంకుల యజమానులు ఈ సమస్యను ఆయిల్‌ కంపెనీల దృష్టికి తీసుకువెళ్లారు. ఆయిల్‌ కంపెనీలు స్పందించకపోగా.. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో పెట్రోలియం డీలర్లు అసహనానికి గురయ్యారు. తామేదో కల్తీ చేస్తున్నామంటూ వాహనదారులు తమ మీద దాడులకు తెగపడుతున్నారని, ఆయిల్‌ కంపెనీలవారు ఇథనాల్‌ను ఎందుకు కలుపుతున్నారో తెలుపుతూ, బాధ్యతగా బంకుల దగ్గర బ్యానర్లను ఏర్పాటు చేయాలని డీలర్లు డిమాండ్‌ చేశారు. తమ విజ్ఞప్తిని ఇప్పటి వరకు ఆయిల్‌ కంపెనీలు మన్నించకపోవటంతో డీలర్లలో ఆగ్రహం పెరిగింది. దీంతో పెట్రోలియం డీలర్లు, ఆయిల్‌ కంపెనీల మధ్య పరోక్ష యుద్ధం మొదలయింది. 


పెట్రోల్లో ఇథనాల్‌ మిక్సింగ్‌కు సంబంధించి ఆయిల్‌ కంపెనీల నిర్వాకంపై డీలర్లు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా మొత్తం  280 పెట్రోలియం బంకులున్నాయి. ఈ బంకుల్లో ప్రస్తుతం  ప్రతి రోజూ సగటున 8,40,000 లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తుంటారు. పెట్రోల్‌ మీద నడిచే వివిధ కేటగిరీ వాహనాలు జిల్లా వ్యాప్తంగా 20 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 12 లక్షల మోటారు సైకిళ్లు (ద్విచక్ర వాహనాలు) ఉన్నాయి. జిల్లాలోని పెట్రోల్‌ బంకులకు కొండపల్లిలోని ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి పెట్రోలియం సరఫరా అవుతుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)లు పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ కలుపుతున్నారు. పెట్రోల్‌ తీవ్రతను తగ్గించటానికి శాస్ర్తీయ పద్ధతిలో ఇలా చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఇలా చేయటం వల్ల పెట్రోల్‌ కల్తీ కాదని, వాహనాలకు డ్యామేజీ ఏర్పడదని ఆరోగ్యకరంగా ఉంటుందని, మండే స్వభావం తీవ్రత కూడా తగ్గుతుందని చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన శాస్ర్తీయ పద్ధతుల గురించి ఎక్కడా బహిర్గత పరచలేదు. ఇలా చాలా కాలంగా నడుస్తోంది. కొండపల్లిలోని ఈ మూడు ఆయిల్‌ కంపెనీల పరిధిలో ఇథనాల్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. ఇథనాల్‌ మిక్సింగ్‌లో చోటు చేసుకుంటున్న లోపాల కారణంగా అది ఆయిల్‌లో సరిగా కలవడం లేదని తెలుస్తోంది. ఇలా కలవని అయిల్‌ను పెట్రోలియం డీలర్లు ట్యాంకుల్లో నింపుకుని దిగుమతి చేస్తున్నారు. తమ బంకుల్లోని అండ ర్‌ గ్రౌండ్‌ ట్యాంకుల్లో దానిని నిల్వ చేస్తున్నారు. పెట్రోల్లో కలవని కారణంగా మిథనాల్‌ ట్యాంకు అడుగు భాగంలో పేరుకు పోతోందని, ఆయిల్‌ కొట్టేటపుడు అది ఫోర్సుగా పంపుద్వారా వాహనాల్లోకి చేరుతోందని పెట్రోలియం డీలర్లు అంటున్నారు. పూర్తిగా మిక్సింగ్‌ కాకపోవటం వల్ల ఇథనాల్‌ ఇంజన్‌లోకి ప్రవేశించినపుడు వాహనం ఆగిపోతున్నదని చెబుతున్నారు. ఇలా వాహనాలు ఆగిపోవటం వల్ల తాము పెట్రోల్‌లో నీళ్లు పోస్తున్నామని వాహనదారులు అనుకుంటున్నారని వాపోతున్నారు. ఇథనాల్‌ పూర్తిగా పెట్రోల్లో కలిస్తే సమస్య ఉండదని, కలవకపోతేనే సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ఇథనాల్‌ తేమ ఇంజన్‌ను తాకగానే ఆగిపోవటం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి వాహనదారులకు అవగాహన ఉండక తామేదో కల్తీ చేస్తున్నామని భ్రమపడుతూ, తమ మీద గొడవలకు దిగుతున్నారని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్‌ కంపెనీలు దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. ఇథనాల్‌ను ఆయిల్‌ కంపెనీలే కలుపుతున్నాయి కాబట్టి.. వారే బాధ్యత తీసుకోవాలని పట్టుబడుతున్నారు. 


ఆయిల్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి 

రెండు రోజుల క్రితం కొన్ని బంకుల్లో పెట్రోల్‌ కొట్టించుకున్న వాహనాలు ఆగిపోయినమాట వాస్తవం. పెట్రోల్లో నీళ్లు కలిపి, కల్తీ చేయడమే ఇందుకు కారణమని వాహనదారులు భావించి గొడవలకు దిగుతున్నారు. వాహనదారులు ఇలా గొడవ చేయటం తగదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్లో 10 శాతం ఇథనాల్‌ కలుపుతున్నారు. కొన్నిసార్లు అది పెట్రోల్లో సరిగా కలవకపోవటం వల్ల ఇలా జరుగుతోంది. పెట్రోల్లో నీళ్లు కలిపి అమ్మటం జరగని పని. ఇథనాల్‌ను సరిగా కలపకపోవటం ఆయిల్‌ కంపెనీల తప్పిదం. ఇందులో మా తప్పేమీ లేదు. వాహనదారులకు ఈ విషయాలు తెలియకపోవటం వల్ల మేము తప్పు చేస్తున్నామని అనుకుంటున్నారు. కాబట్టి దీనికి కారణమైన అయిల్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మేమే డిమాండ్‌ చేస్తున్నాం.  - చుంచు నరసింహారావు, జిల్లా పెట్రోల్‌ - డీజిల్‌ బంక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Updated Date - 2020-12-15T06:06:03+05:30 IST