నేతలను నిలదీయండి

ABN , First Publish Date - 2020-12-29T06:51:38+05:30 IST

పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ జై కిసాన్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని గుడివాడ, పెడన, మచిలీపట్నంలలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించారు.

నేతలను నిలదీయండి
మచిలీపట్నం రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

తూర్పు కృష్ణా పర్యటనలో ప్రజలకు జనసేనాని పిలుపు

రైతులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్‌

బందరులో డీఆర్వోకు వినతిపత్రం 


పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ జై కిసాన్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని గుడివాడ, పెడన, మచిలీపట్నంలలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని, రైతులను ఆదుకోవాలని డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. పాలనపై శ్రద్ధ పెట్టని నేతలను నిలదీయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. 


ఙఆంధ్రజ్యోతి, మచిలీపట్నం / గుడివాడ : ప్రజలను భయపెట్టి పాలించలేరనే విషయాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గ్రహించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హితవు పలికారు. నాయకులకు పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంపై లేదని మండిపడ్డారు. నివర్‌ తుఫాన్‌ బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు తూర్పు కృష్ణాలో రైతులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గుడివాడ, గుడ్లవల్లేరుల్లో రోడ్డు షోకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుడివాడలో పవన్‌కు క్రేన్‌ సాయంతో గజమాల వేశారు. తొలిసారిగా గుడివాడ వచ్చిన తనకు ఇక్కడి ప్రజలు చూపిన ఆదరాభిమానాలు జీవితాంతం గుర్తుంచుకుంటానని పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు తక్షణ సాయంగా రూ.10వేలు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి  ఎకరానికి రూ.35వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే జనసేనపార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

పెడన నియోజకవర్గం నడుపూరు వద్ద  జనసేనానికి ఆ పార్టీ నాయకులు,  రైతులు స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడిన పవన్‌కల్యాణ్‌ కలెక్టరుకు వినతిపత్రం అందించేందుకు కలెక్టరేట్‌కు రావాలని కోరారు. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ అభిమానులు, రైతులు ఘనస్వాగతం పలికారు. లక్ష్మీటాకీస్‌ సెంటరులో ఏర్పాటు చేసిన సభలో పవన్‌కల్యాణ్‌ రైతులనుద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో 70శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, గ్రామ వలంటీర్ల ద్వారా వీరిని గుర్తించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రైతులతో కలసి కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌కు పెద్దఎత్తున జనసేన అభిమానులు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యంకాలేదు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, రైతులు శనక్కాయల జనార్థనరావు, వూసా వెంకయ్య, జనసేన జిల్లా నాయకులు  బూరగడ్డ  శ్రీకాంత్‌,  పోతిన మహేష్‌, అమ్మిశెట్టివాసు, అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-29T06:51:38+05:30 IST