విజయవాడలో అధికార బెట్టింగ్
ABN , First Publish Date - 2020-12-30T06:29:47+05:30 IST
అధికార పార్టీ నేతల ఆటకు అంతులేకుండా పోయింది.

కృష్ణలంకలో ఆన్‌లైన్ బెట్టింగ్
ఎస్‌ఈబీ దాడుల్లో పట్టుబడిన గ్యాంగ్
పది మంది అరెస్టు.. ఒకరు పరారీ
విజయవాడ/వన్‌టౌన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అధికార పార్టీ నేతల ఆటకు అంతులేకుండా పోయింది. గాంబ్లింగ్‌కు తెర తీస్తున్నారు. పొరుగు జిల్లాల్లో ఉన్న వాళ్లనీ ఇక్కడికి రప్పించి, ఇళ్లలో బోర్డు పెట్టేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లను వివిధ కార్యకలాపాల కోసం అద్దెకు తీసుకుని వాటిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుదిరితే పేకలను తిప్పేస్తున్నారు. లేకపోతే ఆన్‌లైన్‌లో ఆట మొదలు పెట్టేస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎస్‌ఈబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈ విషయం తేలింది. కృష్ణలంక సత్యంగారి దొడ్డి సమీపంలో గల ఇంట్లో రహస్యంగా సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ బాగోతం బట్టబయలైంది. ఇందులో మొత్తం నలుగురు వైసీపీ నేతలున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకవరం గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావు కృష్ణలంకలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సమాచారం తెలియడంతో ఎస్‌ఈబీ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. శ్రీనివాసరావుతోపాటు కైకవరానికి చెందిన గుర్రం ప్రసాద్, మర్రిశెట్టి శంకర్, నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన కోలాట సంతోష్‌కుమార్, రామవరప్పాడుకు చెందిన దొంగ రాజేష్, ఆరేపల్లి వాసు, తుపాకుల స్వామి, ప్రసాదంపాడుకు చెందిన అంపోలు గోపి, యనమలకుదురుకు చెందిన కాకాని సత్యనారాయణను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.63,950, టీవీ, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసు కున్నారు. మరో నిందితుడు కైకవరం గ్రామానికి చెందిన మట్టా పోతురాజు పరారీలో ఉన్నాడు. నిందితుల్లో తుపాకుల స్వామి, దొంగ రాజేష్, ఆరేపల్లి వాసు, అంపోలు గోపి వైసీపీ నేతలు. స్వామి భార్య రామవరప్పాడు సర్పంచ్ అభ్యర్థి. అరెస్టయిన వారిలో ఎక్కువ మంది వైసీపీవారు కావడంతో పోలీసులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి.