-
-
Home » Andhra Pradesh » Krishna » Oil if mask
-
మాస్క్ ఉంటేనే ఆయిల్
ABN , First Publish Date - 2020-03-24T09:56:21+05:30 IST
పెట్రోల్, డీజిల్ బంకులకు తప్పక మాస్కులు ధరించి రావాలని పెట్రోల్, డీజిల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది.

పెట్రోలు, డీజిల్ బంకుల్లో నిబంధనలు
మాస్క్ లేదా కర్చీఫ్ ముఖానికి తప్పనిసరి
ఒక్కో వాహనం మధ్య రెండు మీటర్ల దూరం
వాహనదారుల చేతులు శుభ్రం చేసే ఆలోచన కూడా
జిల్లా పెట్రోల్, డీజిల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటన
ఆంధ్రజ్యోతి, విజయవాడ : పెట్రోల్, డీజిల్ బంకులకు తప్పక మాస్కులు ధరించి రావాలని పెట్రోల్, డీజిల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. మాస్క్ లేకపోతే కనీసం కర్చీఫ్ అయినా కట్టుకుని రావాలని, లేనిపక్షంలో అనుమతించబోమని స్పష్టం చేసింది. స్వీయ నియంత్రణా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు చుంచు నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి నిర్మూలన కోసం అధికార యంత్రాంగం విధించిన 144 సెక్షన్‌ను అనుసరించి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. జిల్లావ్యాప్తంగా 290, నగర పరిధిలో 40 డీజిల్, పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటన్నింటిలో ఈ నిబంధనలు అమలవుతాయి.
ఒక్కసారిగా వాహనాలతో బంకుల్లోకి వచ్చేస్తున్నారని, దీనివల్ల విపరీతమైన రద్దీ నెలకొంటోందని, తమ సిబ్బంది రక్షణ బాధ్యతలు కూడా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బహిరంగంగా విధులు నిర్వహించాల్సి రావటంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొంటున్నాయని, దీని దృష్ట్యా మాస్కులు కానీ, కర్చీఫ్ కానీ ముఖానికి కట్టుకుని రావాలన్న నిబంధన అమలు చేస్తున్నట్టు వివరించారు. ఆయిల్ కోసం వచ్చే వాహనదారుల చేతులు శుభ్రం చేయించటానికి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నామన్నారు. బంకుల్లోకి ప్రవేశించేటపుడు కనీసం రెండు మీటర్ల దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు.