కొత్త కేసులు 129

ABN , First Publish Date - 2020-07-15T09:06:53+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం కొత్తగా 129 మందికి వైరస్‌ సోకింది.

కొత్త కేసులు 129

ఆగని కరోనా ఉధృతి

మొత్తం కేసులు 2744 

24 గంటల్లో 46 మంది డిశ్చార్జి 


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం కొత్తగా 129 మందికి వైరస్‌ సోకింది. వీరితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ బాధితుల సంఖ్య 2744కు చేరింది. గడిచిన 24 గంటల్లో 46 మంది వ్యాధి నుంచి కోలుకుని కొవిడ్‌ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి ఇంతవరకు మొత్తం 1887 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. ఇంకా 744 మంది చికిత్స పొందుతున్నారు. అనేక మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 


జిల్లాలో ఇంతవరకు కరోనా వల్ల 83 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 129 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80కి పైగా కేసులు విజయవాడ నగర పరిధిలో నమోదు కాగా..  జిల్లావ్యాప్తంగా మరో 45 కేసులకు పైగా నమోదయ్యాయి. నగరంలో లెనిన్‌ సెంటర్‌, గుణదల, లయోలా కాలేజీ, పటమట, అశోక్‌నగర్‌, లబ్బీపేట, కృష్ణలంక, మాచవరం, ముత్యాలంపాడు, మధురానగర్‌, సింగ్‌నగర్‌, రామలింగేశ్వరనగర్‌, శ్రీనగర్‌, సత్యనారాయణపురం, కేదారేశ్వరపేట, గాంధీనగర్‌, వన్‌టౌన్‌, కొత్తపేట బ్రాహ్మణవీధి, పాయకాపురం, భవానీపురం తదితర ప్రాంతాల్లోను, నగర శివారు ప్రాంతాలైన రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, కానూరు, యనమలకుదురు, పోరంకి, గొల్లపూడి, గన్నవరం ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని గోపవరం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, గుంటుపల్లి, మచిలీపట్నం, చల్లపల్లి, పెడన, కంకిపాడు, ముచ్చింతల, నందిగామ మండలాల్లో దాదాపు 50 వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


ఎయిర్‌పోర్టులో కలకలం

ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ సిబ్బందిలో మూడు రోజుల క్రితం ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మంగళవారం నాటికి ఆ బాఽధితుల సంఖ్య 23కు చేరుకున్నట్లు తెలిసింది. ఎయిర్‌ పోర్టులో విధులు నిర్వహిస్తున్న మొత్తం 88 మందికి ప్రభుత్వం అక్కడే మెస్‌ ఏర్పాటు చేసింది. ఈ మెస్‌లో పనిచేసే వంట మనిషికి తొలుత  వైరస్‌ సోకింది. బెటాలియన్‌ సిబ్బంది అందరూ అక్కడే భోజనాలు చేయడం, తమ ఆయుధాలను ఒకేచోట భద్రపరచడం, అందరూ కలిసి ఒకేచోట నిద్రపోవడం వల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్లు భావిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిని మాత్రమే ఆసుపత్రికి తరలించిన అధికారులు మిగిలిన సిబ్బంది డ్యూటీలు చేయాలని ఆదేశించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 


నూజివీడులో తొలి కొవిడ్‌ మరణం 

నూజివీడు : కరోనా కేసుల సంఖ్యలో విజయవాడ తరువాత రెండోస్థానంలో ఉన్న నూజివీడులో తొలి కరోనా మరణం నమోదయింది. సోమవారం రాత్రి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ నిర్వహించే ఒక వ్యక్తి కొవిడ్‌ లక్షణాలతో మరణించారు. రెండు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకున్న అతనికి సోమవారం సాయంత్రం రిపోర్టు వచ్చింది. పాజిటివ్‌ అని సమాచారం అందుకున్న అధికారులు అతని నివాసానికి చేరుకొనే సమయానికి కొద్ది నిమిషాల ముందే మృతిచెందాడు. కాగా మంగళవారం పట్టణంలో రెండు, గోపవరం గ్రామంలో ఒక కేసు నమోదైనట్టు అధికారికంగా ప్రకటించారు. 


మచిలీపట్నం డివిజన్‌లో ముగ్గురు మృతి

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం  : డివిజన్‌లో  మంగళవారం 12 కరోనా కేసులు నమోదైనట్లు ఆర్డీవో తెలిపారు. పెడనలో ఒకరు, మచిలీపట్నంలో ఇద్దరు విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. చల్లపల్లిలో మూడు,  పెడన, మచిలీపట్నంలోని పరాసుపేట, రాజుపేట,  ఇనుగుదురుపేట,  బుట్టాయిపేట, నిజాంపేట, బైపాస్‌ రోడ్‌ కాలనీ,  జగన్నాధపురంలలో ఒక్కో కేసు నమోదయ్యాయన్నారు.  


నున్నలో ఒకే కుటుంబంలో నలుగురికి..

విజయవాడ రూరల్‌ : మండలంలోని నున్నలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. టీచర్స్‌ కాలనీలో ఉంటున్న ఒక కుటుంబంలో భార్యాభర్తలు, కుమారుడుతోపాటు మరో మహిళ కరోనాబారిన పడ్డారు. 

Updated Date - 2020-07-15T09:06:53+05:30 IST