రాజకీయ రణరంగం.. మైలవరం నియోజకవర్గంలో ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-09-01T14:50:56+05:30 IST

మైలవరం నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. టీడీపీ వర్గీయులపై..

రాజకీయ రణరంగం.. మైలవరం నియోజకవర్గంలో ఉద్రిక్తం

టీడీపీ వర్గీయులపై వరసదాడులు 

10 రోజుల క్రితం గుర్రాజుపాలెంలో.. 

ఆ తరువాత ఇబ్రహీంపట్నంలో వైసీపీ దాడులు

అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకే! 

వసంత వ్యాఖ్యల తర్వాతే ఈ పరిస్థితి! 

టీడీపీ నేతల ఆగ్రహం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): మైలవరం నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు వరుస దాడులకు తెగబడటం కలకలం సృష్టిస్తోంది. పది రోజుల క్రితం గుర్రాజుపాలెం గ్రామంలో షేక్‌ ఇమామ్‌ అనే టీడీపీ సానుభూతిపరుని ఇంటిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. పార్టీ మారడం లేదని మారణాయుధాలతో గాయపరిచారు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన మరువక ముందే కొండపల్లి రిజర్వు ఫారెస్టులో ఎమ్మెల్యే వసంత, అతని బామ్మర్ది చేసిన అక్రమ మైనింగ్‌ను పరిశీలించి ప్రశ్నించినందుకు టీడీపీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌, నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి సజ్జా అజయ్‌పై ఇబ్రహీంపట్నంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, వసంత అనుచరులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అజయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, టీడీపీ నేత పట్టాభి తదితరులు బాధితుడ్ని పరామర్శించి, ఈ ఘటనపై సీపీకి ఫిర్యాదు చేశారు. 


అక్రమ మైనింగ్‌ బయటపడుతుందనే భయంతోనే..

సెంటు పట్టా మెరక పేరుతో కొండపల్లి రిజర్వు ఫారెస్టు, దేవదాయ భూముల్లో వసంత బామ్మర్ది పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడు. భారీ ఎత్తున కొండపల్లి రిజర్వు ఫారెస్టులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన పాపానికి ఓ కార్యకర్త చెంప చెళ్లు మనిపించాడు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు కొండపల్లి రిజర్వు ఫారెస్టులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై దాడులు చేసి, యంత్రాలను, టిప్పర్లను స్వాధీనం చేసుకొని రూ.10 లక్షలు జరిమానా విధించారు. ఇప్పటి వరకు ఆ యంత్రాలు, లారీలు విడుదల కాలేదు.


ఇదే సమయంలో నియోజకవర్గంలోని శ్యాండ్‌, మైన్‌, వైన్‌, ల్యాండ్‌ మాఫియాను మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నిస్తున్నారనే అసహనంతో వసంత ఇటీవల ఇబ్రహీంపట్నంలో మీడియా ఎదుట ఉమాపై తిట్ల పురాణం అందుకున్నారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ వర్గీయులు మరింత రెచ్చిపోయి, తమను టార్గెట్‌ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో అజయ్‌పై జరిగిన దాడి ఇందులో భాగమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-09-01T14:50:56+05:30 IST