మత్తులోనే మహేశ్ హత్య!
ABN , First Publish Date - 2020-10-21T11:25:29+05:30 IST
నగర శివార్లలో జరిగిన కాల్పుల కలకలానికి మద్యం మత్తే కారణమని పోలీసులు తేల్చారు.

విజయవాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : నగర శివార్లలో జరిగిన కాల్పుల కలకలానికి మద్యం మత్తే కారణమని పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌కు చెందిన నిందితులిద్దరిని, విజయవాడకు చెందిన ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయ పే సెక్షన్లో గుమస్తాగా పనిచేస్తున్న గజిగంట్ల మహేశ్ ఈనెల పదో తేదీన నున్న బైపాస్ రోడ్డులో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలను పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఉపకమిషనర్ విక్రాంత్‌పాటిల్, నున్న ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మంగళవారం వెల్లడించారు. కడపకు చెందిన బీరం సాకేత్‌రెడ్డి, ఏలూరుకు చెందిన జాన గంగాధర్ అలియాస్ గంగూభాయ్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఓ హాస్టల్ రూమ్‌లో ఉంటున్నారు. అదే హాస్టల్లో ఉంటున్న తెనాలివాసి సందీప్‌తో వీరికి స్నేహం కుదిరింది.
అసలు స్కెచ్ ఇదీ..
సాకేత్‌రెడ్డి ఓ హోటల్ యజమానిని చంపాలనుకుని పిస్టల్‌ను కొనుగోలు చేశాడు. హాస్టల్లో ఉన్న స్నేహితులకు దాన్ని చూపించి, ఏదైనా సెటిల్మెంట్ ఉంటే చెప్పమని అడిగాడు. దీంతో సందీప్ రెండు డీల్స్‌ను సాకేత్‌రెడ్డి ముందుంచాడు. విజయవాడ మధురానగర్‌కు చెందిన ఓ వ్యక్తి చేతిలో తాను రూ.2లక్షలు నష్టపోయానని, అతడికి వార్నింగ్ ఇవ్వాలన్నది మొదటి డీల్. ఇక రెండోది కిడ్నాప్. తెనాలికి చెందిన వెండి వ్యాపారి కుమారుడ్ని కిడ్నాప్ చేస్తే రూ.కోటి సంపాదించవచ్చునని చెప్పాడు. ఈ రెండింటికీ సాకేత్‌రెడ్డి ఒప్పుకున్నాడు. సాకేత్‌రెడ్డి, గంగాధర్ పదో తేదీన విజయవాడ చేరుకుని, గవర్నరుపేటలోని ఓ లాడ్జిలో దిగారు. సాకేత్‌రెడ్డి గతంలో విజయవాడలో కొంతకాలం ఉన్నాడు. అప్పట్లో శాంతినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ముదిరెడ్డి రాధాకృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది.
జరిగింది ఇదీ..
లాడ్జిలో దిగిన సాకేత్‌రెడ్డి అదేరోజు సాయంత్రం రాధాకృష్ణారెడ్డికి ఫోన్ చేశాడు. మద్యం తాగడానికి మంచి ప్రదేశం చూపించమని అడిగాడు. మద్యం సీసాలతో ఆటో ఎక్కిన సాకేత్‌రెడ్డి, గంగాధర్ అనువైన ప్రదేశాన్ని వెదుకుతూ, నున్న బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. బీట్ కానిస్టేబుళ్లు హెచ్చరించడంతో ఆటో వెళ్లిపోయింది. సాకేత్‌రెడ్డి, గంగాధర్ అక్కడే ఉండి మద్యం బాగా తాగారు. అక్కడికి కొద్ది దూరంలోనే మహేశ్, దినేష్, హరికృష్ణ ఉన్నారు. అదే సమయంలో మహేశ్, దినేష్, హరికృష్ణ కేకలు వేసుకున్నారు. దినేష్ ఇద్దరు ముగ్గురు మహిళల పేర్లు ప్రస్తావించి తిట్టాడు. ఈ మాటలు విన్న సాకేత్‌రెడ్డి, గంగాధర్‌తో కలిసి వారి వద్దకు వెళ్లాడు. కారులో అమ్మాయిలున్నారని భావించిన సాకేత్‌రెడ్డి అమ్మాయిలను తిడుతున్నారేంటంటూ పిస్టల్ చూపించాడు. ఇంతలో మహేశ్ తాను పోలీస్‌శాఖలో ఉద్యోగినని చెప్పాడు. వెంటనే సాకేత్‌రెడ్డి కాల్పులు జరిపాడు. మహేశ్ గొంతు, ఛాతీ భాగంలో రెండు బుల్లెట్లు దిగాయి. మరో బుల్లెట్ హరికృష్ణ పొట్టను తాకుతూ వెళ్లిపోయింది. హడలిపోయిన హరికృష్ణ తన వద్ద ఉన్న రూ.200 ఇవ్వడానికి ప్రయత్నించాడు.
అవసరమైతే కారు తీసుకుపొమ్మన్నాడు. ఆటో కనిపించకపోవడంతో హరికృష్ణ కారులో పారి పోయారు. దాన్ని ముస్తాబాదలోని ఒక టింబర్‌డిపో వద్ద వదిలేసి, మరో ఆటోలో లాడ్జికి వెళ్లారు. వెంటనే లాడ్జిని ఖాళీ చేసి, రాత్రికి రాత్రి టాక్సీలో హైదరాబాద్‌కు పారిపోయారు. ఘటనా స్థలంలో ఆటో గురించి తెలుసుకున్న పోలీసులు దాని ద్వారా మొత్తం కేసును ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, ఇతర సాంకేతిక మార్గాల ద్వారా నిందితులను పట్టుకున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుల నుంచి పిస్టల్, మ్యాగ్జైన్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.