కీచకుడికి రక్ష..!

ABN , First Publish Date - 2020-08-18T15:22:33+05:30 IST

ఆయన ఓ మండలానికి విద్యాశాఖాధికారి. పవిత్రమైన వృత్తిలో..

కీచకుడికి రక్ష..!

ముదినేపల్లి ఎంఈవోపై లైంగిక వేధింపుల ఆరోపణ

ఆరు నెలల క్రితమే ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయిని

ఎంఈవోపై చర్యలను పక్కనపెట్టి ఉపాధ్యాయినికే నోటీసు

ముడుపులదే పైచేయి

నేడు మూడోసారి విచారణ


విజయవాడ, ఆంధ్రజ్యోతి: ఆయన ఓ మండలానికి విద్యాశాఖాధికారి. పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆయన తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ సహచర ఉపాధ్యాయినులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోగా, ఆరోపణలు చేసిన బాధితురాలికే జిల్లా విద్యాశాఖాధికారులు నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం.. జిల్లాలో మహిళల రక్షణ ఎలా ఉందో తెలియజేస్తోంది. 


తాను విద్యాశాఖాధికారి లైంగిక వేధింపులకు గురయ్యానని ముదినేపల్లి మండలానికి చెందిన మహిళా ఉపాధ్యాయిని, కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ) ఫిబ్రవరి 24న కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సదరు అధికారి అక్కడే ఉన్నారు. ఫిర్యాదు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బాధితురాలికి న్యాయం జరగలేదు. పైగా ఎంఈవోపై ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయినికి జిల్లా విద్యాశాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. ‘రూల్స్‌ను అతిక్రమించి మీరు వ్యవహరిస్తున్నారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటాం.’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈవోపై మాత్రం చర్యలు లేవు. ఇప్పటివరకు రెండుసార్లు విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప జిల్లా విద్యాశాఖాధికారులు సాధించింది శూన్యం. తాజాగా మంగళవారం మరోసారి విచారణకు రంగం సిద్ధం చేశారు. 


ఎంఈవోకు జిల్లా అధికారుల అండ

ముదినేపల్లి ఎంఈవోపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఓ జిల్లాస్థాయి అధికారి, ఈయన ఒకే సామాజికవర్గం కావడం, పెద్దఎత్తున ముడుపులు అందజేస్తుండటంతో ఆరోపణలన్నీ విచారణ స్థాయిలోనే తేలిపోతున్నాయి. ఉపాధ్యాయురాలే కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలితో పాటు మండలానికి చెందిన సీఆర్‌పీ కూడా ఎంఈవోపై ముదినేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సదరు ఎంఈవో స్టేషన్‌కు చేరుకుని తన భార్యతో సీఆర్‌పీపైన, ఆమె భర్తపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని సీఆర్‌పీతో రాజీ చేసుకున్నా, ఉపాధ్యాయిని మాత్రం రాజీ పడలేదు. దీంతో ఎంఈవో జిల్లా అధికారులను ఆశ్రయించారు.


భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పడంతో ఆయనపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చడంలో జిల్లా విద్యాశాఖాధికారులు ఆసక్తి చూపట్లేదు. ఇప్పటికే రెండుసార్లు విచారణలు జరిపిన అధికారులు మూడోసారి మంగళ వారం విచారణకు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో కొందరు సైతం ఈ కీచక ఎంఈవోకు వత్తాసు పలుకుతుండటం గమనార్హం. మండలంలో మూతపడిన ఓ పాఠశాలలో కంప్యూటర్లు, వంట సామగ్రి మాయం చేయడం, ఉపాధ్యాయుల జీతాల బిల్లులకూ డబ్బులు లాగడం వంటి ఆరోపణలు ఇప్పటికే ఎంఈవోపై ఉన్నాయి. 


డీఈవోగా మహిళ ఉన్నా రక్షణ లేదా..?

జిల్లా విద్యాశాఖాధికారిగా ఓ మహిళ ఉన్నా ఉపాధ్యాయినులకు రక్షణ లేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎంఈవో తీరుపై మండలంలోని పలువురు ఉపాధ్యాయినులు ఫిర్యాదులు చేస్తున్నా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి స్పందన లేదు.


Updated Date - 2020-08-18T15:22:33+05:30 IST