ఫ్లైఓవర్‌ను పూర్తిచేసింది టీడీపీనే!

ABN , First Publish Date - 2020-12-27T15:02:57+05:30 IST

నగరంలో సాధ్యపడదని పక్కన పెట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను..

ఫ్లైఓవర్‌ను పూర్తిచేసింది టీడీపీనే!

మంత్రి వెలంపల్లి అవినీతి పరుడు : ఎంపీ కేశినేని నాని


చిట్టినగర్(కృష్ణా): నగరంలో సాధ్యపడదని పక్కన పెట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. తన ఎంపీ నిధులు రూ.33 లక్షలతో ఆంజనేయవాగు ప్రాంతంలో నిర్మించిన సీసీ రోడ్డును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందన్నారు. నగరాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,800 కోట్ల వరకు నిధులు తీసుకువచ్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. దేవదాయ శాఖ మంత్రి పూర్తిగా అవినీతికి పాల్పడుతూ దేవాలయాల ఆస్తులను దోచేసి సొంత మనుషులకే అధికారాలు కట్టబెడుతున్నాడని వెలంపల్లిపై ఆరోపణలు చేశారు.


టీడీపీ ఎప్పూడూ ప్రజల పక్షానే ఉంటుందని, ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన పోరాడుతుందని భరోసా ఇచ్చారు. పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ నాగుల్‌ మీరా మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే కోట్లాది రూపాయలతో పశ్చిమలోని రోడ్లను అభివృధ్ది చేసినట్లు వివరించారు. వాగు సెంటర్‌లో రోడ్డు చిన్నపాటి వర్షానికే నీట మునిగి ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, అధికార పార్టీ నేతలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. సమస్యను ఎంపీ కేశినేని నాని దృష్టికి తీసుకెళ్లిన వెంటనే తన ఎంపీ నిధుల నుంచి రూ.33 లక్షలు కేటాయించి రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయించారన్నారు. అలాగే ఎంపీ కేశినేని నానీ కుమార్తె శ్వేత సీసీరోడ్డు ప్రాంతంలోని ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు సుకాశి కిరణ్‌కుమార్‌, పేరాబత్తుల రాజేశ్వరి, నేతలు ఎండీ.ఫతావుల్లా, కె,హనుమంతరావు, ఉమ్మడి చంటి, పరిశపోగు రాజేష్‌, నాగోతి రామారావు, పేరాబత్తుల రమణ, సారిపల్లి రాధాకృష్ణ, పిళ్ళా సుదర్శన్‌రావు, బూర కనకరావు మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T15:02:57+05:30 IST