-
-
Home » Andhra Pradesh » Krishna » mlc election contestents
-
ఎవరెవరు..?
ABN , First Publish Date - 2020-12-06T06:12:17+05:30 IST
ఎవరెవరు..?

ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై ఉత్కంఠ
ఏఎస్ రామకృష్ణ, బొడ్డు నాగేశ్వరరావు వరకు ఓకే..?
వైసీపీ అభ్యర్థిపై మల్లగుల్లాలు
అనంతపురం జిల్లావాసిని పోటీ చేయించే ప్రయత్నం
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్సీలు ఏఎస్ రామకృష్ణ, బొడ్డు నాగేశ్వరరావు పోటీలో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకున్నా టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏఎస్ రామకృష్ణ, వామపక్షాల మద్దతుతో బొడ్డు నాగేశ్వరరావు తమ వంతుగా ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ తరఫున అభ్యర్థిగా విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న జిల్లా డీఈవోగా పనిచేసిన దేవానందరెడ్డి కుటుంబ సభ్యులను పోటీలోకి తీసుకురావాలని కొందరు యూనియన్ నాయకులు ప్రయత్నించారు. అయితే, ఆయన తిరస్కరించారు. దీంతో ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టరుగా ఉన్న ప్రతాప్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆయన భార్యను కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయ సంఘం నాయకులు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
విశాఖపట్నంలో రాయబారాలు
ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టరుగా పనిచేస్తున్న ప్రతాప్‌రెడ్డి, కొందరు యూనియన్ నాయకులు ఇటీవల విశాఖపట్నం వెళ్లి ఎంపీ విజయసాయిరెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతాప్‌రెడ్డి అనంతపురానికి చెందినవారు కావడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికేతరులు పోటీచేస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ఈ అంశం తన పరిధిలో లేదని, నేరుగా ముఖ్యమంత్రినే సంప్రదించాలని విజయసాయిరెడ్డి చెప్పి వెనక్కు పంపినట్లు ఉపాధ్యాయులు అంటున్నారు. అయినా కొందరు యూనియన్ నాయకులు ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది.
స్థానికంగా అభ్యర్థులు లేరా?
స్థానికేతరులకు వైసీపీ మద్దతు తెలిపితే గెలుపు అవకాశాలు ఎంతమేర ఉంటాయనేది ప్రశ్న. వచ్చే ఆదివారం రెడ్డి సామాజికవర్గానికి చెందినవారంతా గుంటూరులో కార్తీక వనసమారాధన ఏర్పాటు చేశారని, ఈ సమావేశంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి భార్య పేరును ఎమ్మెల్సీగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రెండు జిల్లాలకు చెందినవారిని కాకుండా అనంతపురం జిల్లాకు చెందినవారిని అధికార పార్టీ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, ఉపాధ్యాయ వర్గానికి చెందని వారిని అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన సమంజసంగా లేదనే వాదన కూడా వినిపిస్తోంది.