ఎలక్షన్‌ కమిషనర్‌కు క్షమాపణ చెప్పండి

ABN , First Publish Date - 2020-03-19T10:32:03+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు ఎలక్షన్‌ కమిషనర్‌కు క్షమాపణ చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్‌ చేశారు.

ఎలక్షన్‌ కమిషనర్‌కు క్షమాపణ చెప్పండి

సీఎం, మంత్రులకు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్‌


విద్యాధరపురం, మార్చి 18 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు ఎలక్షన్‌ కమిషనర్‌కు క్షమాపణ చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్‌ చేశారు. ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. ఆటోనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు మాస్కులు, శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉందని, జగన్‌ ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని విమర్శించారు.  వైరస్‌పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. పోలీసు యంత్రాంగం బెదిరింపులు, ప్రలోభాలు, దౌర్జన్యకాండలతో మొదలుపెట్టించిందని విమర్శించారు.


రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 126 జడ్పీటీసీలు, 2,380 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడం ప్రభుత్వ దగా, దౌర్జన్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. 151 సీట్లు గెలిచినంత మాత్రాన రాష్ర్టాన్ని వారికి రాసిచ్చినట్టుగా ఫీలవుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వీరంకి వెంకట గురుమూర్తి, నిమ్మనపూడి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-19T10:32:03+05:30 IST