ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-10-03T21:52:45+05:30 IST

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ

కృష్ణా : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. నాటి నుంచి నేటి వరకూ వైసీపీ నేతలు, వంశీ మధ్య రెండ్రోజులకోసారైనా వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మీడియా మీట్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అందర్నీ కలుపుకునే వెళ్లే శక్తి తనకుందని వంశీ చెప్పగా.. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా మరోసారి వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


రాళ్లు రువ్వుకున్నారు!

శనివారం నాడు గన్నవరం వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. వల్లభనేని-దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహా బాహికి దిగారు. దీంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు తెలియవచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలియవచ్చింది. ఇలా అస్తమాను వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న పరిణామంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? జిల్లా మంత్రులు, ఇంచార్జ్‌లు ఎలా సర్దిచెబుతారో..? వేచి చూడాలి.

Updated Date - 2020-10-03T21:52:45+05:30 IST