పాతబస్తీలో అడుగడుగునా దాదాగిరీ.. వారంతా ఆ మంత్రి అనుచరులే!
ABN , First Publish Date - 2020-12-10T06:17:16+05:30 IST
పాతబస్తీలో అడుగడుగునా దాదాగిరీ.. వారంతా ఆ మంత్రి అనుచరులే!

ఎందెందు వెదికినా..
మంత్రి కార్యాలయం అడ్డాగా అనుచరుల దందాలు
ఏ నిర్మాణమైనా వారికి కాసులిచ్చిన తర్వాతే!
ప్లాన్.. పన్నులు.. అన్నీ వారి కనుసన్నల్లోనే
అనధికార కట్టడాలే లక్ష్యంగా వసూళ్ల దందా
ఒక్కో భవన నిర్మాణదారుడి నుంచి లక్షల్లో వసూళ్లు
వీఎంసీలో కీలక విభాగాలన్నీ వీరి చెప్పుచేతుల్లోనే
మటన్... మద్యం వ్యాపారాలకూ వీరే అండ
పాతబస్తీలో ఎందెందు వెదికినా మంత్రి అనుచరుల దందాలే. ఏ అక్రమ నిర్మాణంలోకి తొంగి చూసినా, వెనక ఉండేది వారే.. ఎక్కడ వివాదం తలెత్తినా సెటిల్మెంట్ చేసేది వారే... మద్యం దందాలు.. మాంసం దుకాణాలు.. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా లోపాయికారీగా జొరబడేది వారే. అన్ని సెటిల్మెంట్లూ వీరి కనుసన్నల్లోనే. అన్నింటికీ అడ్డా మంత్రి కార్యాలయమే. చివరికి దుర్గగుడిలో కాంట్రాక్టు పనులు కూడా దక్కేది వీరికే. మున్సిపల్ కార్పొరేషన్‌లోని కీలక విభాగాలన్నీ వీరి చేతుల్లోనే ఉంటాయి. ఎక్కడైనా వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట...
విజయవాడ భవానీపురంలో ఓ వ్యక్తి సుమారు 200 గజాల్లో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండా నాలుగు అంతస్థుల కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి, ఓ వాహన కంపెనీకి అద్దెకు ఇచ్చారు. దాన్ని అనధికార కట్టడంగా గుర్తించిన వీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంటనే మంత్రి అనుచరుల నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో వీఎంసీ అధికారులు సైలెంట్ అయిపోయారు. ఈ ఉదంతంలో మంత్రి అనుచరులకు రూ.15 లక్షల వరకు ముట్టినట్టు సమాచారం.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ అనధికార కట్టడం కనిపిస్తే, అక్కడ మంత్రి అనుచరులు వాలిపోతారు. భవన యజమానులను జలగల్లా పట్టి పీల్చేస్తారు. నూతన భవన నిర్మాణాలకు ప్లాన్ అనుమతి నుంచి కొత్త నిర్మాణాలకు పన్ను వేయడం.. అనధికార కట్టడాల జోలికి వీఎంసీ అధికారులు వెళ్లకుండా చూడటం.. ఇలా ప్రతిదీ మంత్రి అనుచరుల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇక వీఎంసీ పరిధిలోని టెండర్ల వ్యవహారాల్లోనూ మంత్రి అనుచరుల హవా నడుస్తోంది. వీరిని కాదనేవారు ఎవరైనా టెండర్లలో పాల్గొంటే, వారికి చుక్కలు చూపిస్తారు. ప్రతినెలా సుమారు రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వీఎంసీ నుంచి వీరు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కీలక విభాగాలన్నీ మంత్రి అనుచరుల చేతుల్లోనే నడుస్తున్నాయి. దానికి నిదర్శనమే ఇటీవల వీఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు మటన్ దుకాణాలపై వరుస దాడులు చేస్తే వీరు జోక్యం చేసుకున్న ఉదంతం.
అక్టోబరు, నవంబరు నెలల్లో వీఎంసీ అధికారులు వన్‌టౌన్‌లోని పలు మాంసం దుకాణాలపై దాడులు చేసి, సీజ్ చేసిన విషయం తెలిసిందే. మంత్రి అనుచరుల జోక్యంతో ఇప్పుడు అవన్నీ తిరిగి తెరుచుకున్నాయి. వన్‌టౌన్‌లోని గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన సాంబశివరావు, సాయి అనే అన్నదమ్ములు నిల్వ మాంసాన్ని విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో వీఎంసీ అధికారులు దాడులు చేసి, వీరి దుకాణాలను సీజ్ చేశారు. వెనువెంటనే మంత్రి అనుచరులు రంగంలోకి దిగి, సీజ్ చేసిన షాపులను తెరవాల్సిందేనంటూ వీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ షాపులు తెరుచుకున్నాయి. వాటిలో నిల్వ మాంసం విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.
మద్యం దందాలోనూ వారే..!
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘బ్రాండ్’ బాజా మోగుతోంది. నాటుసారాను తలపించేలా ఉన్న ఈ సరుకును తాగకుండానే ధరల కిక్కెక్కుతోంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ మద్యం దందాలోనూ మంత్రి అనుచరులే కీలక పాత్రధారులుగా ఉన్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారుల కళ్లుగప్పి స్థానిక పోలీసుల సహకారంతో వీరి మద్యం దందా నిర్విఘ్నంగా సాగుతోంది.
మంత్రి క్యాంపు కార్యాలయమే అడ్డా..!
దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలో ఉండే మంత్రి క్యాంపు కార్యాలయం ఆయన అనుచరుల సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచే మంత్రి అనుచరులు అధికారులకు ఫోన్ చేసి పిలిపించుకుంటారు. తమకు అవసరమైన పనులు చేయించుకుంటారు. ప్రైవేటు సెటిల్‌మెంట్లు సైతం ఇక్కడి నుంచే చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లికార్జునపేటకు చెందిన వస్త్రవ్యాపారి కొద్దిరోజుల క్రితం ఓ చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై చిన్నారి తల్లి వన్‌టౌన్‌లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వస్త్ర వ్యాపారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. వ్యాపారి మంత్రి అనుచరులను ఆశ్రయించాడు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వన్‌టౌన్ సీఐ సమక్షంలో కేసు సెటిల్ చేసేశారు. చిన్నారి తల్లికి కొంత సొమ్ము ముట్టచెప్పి, మంత్రి అనుచరులు ఆ వ్యాపారి నుంచి అరకోటి వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. దుర్గగుడిలో టెండర్లు కూడా వీరి కనుసన్నల్లోనే సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దసరా ఉత్సవాల్లో కాంట్రాక్టు పనులన్నీ మంత్రి అనుచరులే దక్కించుకున్నారు. ఈ పనుల్లో సుమారు కోటి రూపాయల వరకు వెనకేసినట్టు సమాచారం.