వలస కార్మికులకు ఊరట

ABN , First Publish Date - 2020-05-17T08:53:09+05:30 IST

వలస కార్మికులకు కాస్త ఊరట లభించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం శనివారం

వలస కార్మికులకు ఊరట

 జాతీయ రహదారుల వెంట 25 రిలీఫ్‌ సెంటర్ల ఏర్పాటు

 నీరసించిన వారికోసం 20 షెల్టర్‌ హోమ్‌లు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : వలస కార్మికులకు కాస్త ఊరట లభించింది. ప్రభుత్వ  ఆదేశాలతో జిల్లా యంత్రాంగం శనివారం జాతీయ రహదారులపై నడుచు కుని వెళ్తున్న వలస కార్మికుల కోసం 25 రిలీఫ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. విశ్రమిం చటానికి మరో 20 షెల్టర్లు సిద్ధం చేసింది. జగ్గయ్యపేట చెక్‌పోస్టు నుంచి పశ్చిమగోదావరి జిల్లా చెక్‌పోస్టు కలపర్రు వరకు ఈ రిలీఫ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ తాగునీటి సదుపాయం కల్పించారు. వైద్య శిబిరాలను సిద్ధంగా ఉంచారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులోకి తెచ్చారు. భోజనాలు సిద్ధం చేశారు. మార్గంమధ్యలో తినడానికి పండ్లు ఇచ్చారు. రామవరప్పాడు రింగ్‌ వద్ద పలువురు వలస కార్మికులను బస్సులో ఎక్కించుకుని పశ్చిమగోదావరి జిల్లా వరకు దించారు.


బాగా నీరసించి పోయి ముందుకు కదల్లేని వారిని ఆర్టీసీ బస్సుల్లో షెల్టర్‌ హోమ్స్‌కు తరలించారు. రిలీఫ్‌ సెంటర్లలో వలస కార్మికుల సౌకర్యాలను పరిశీలించటానికి వచ్చిన కలెక్టర్‌ ఇంతియాజ్‌ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. షెల్టర్‌ హోమ్‌లో ఉంటే ప్రత్యేక రైళ్ల ద్వారా పంపిస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో కొంతమంది మహిళా కార్మికులు కలెక్టర్‌ ఇంతియాజ్‌కు పాదాభివందనం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారులపై నడుచుకుని వెళ్తున్న 200 మంది వలస కార్మికులను గుంటూరు నుంచి బిహార్‌ తరలించారు. 

Updated Date - 2020-05-17T08:53:09+05:30 IST