కరోనా కారణంగా ‘మీ-సేవ’లు బంద్‌.. వందలాది దరఖాస్తులు పెండింగ్‌

ABN , First Publish Date - 2020-06-26T17:04:32+05:30 IST

గడప దాటితే కరోనా భయం.. దాటకుంటే ప్రభుత్వ పథకాలు చేజారిపోతాయనే భయం.. అందుకే కరోనా భయం వెంటాడుతున్నా,

కరోనా కారణంగా ‘మీ-సేవ’లు బంద్‌.. వందలాది దరఖాస్తులు పెండింగ్‌

ధ్రువీకరణం!

కొత్త దరఖాస్తుల అప్‌లోడ్‌ గగనమే 

ఆందోళనలో ప్రజలు.. పరిష్కారం ఏమిటి? 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): గడప దాటితే కరోనా భయం.. దాటకుంటే ప్రభుత్వ పథకాలు చేజారిపోతాయనే భయం.. అందుకే కరోనా భయం వెంటాడుతున్నా, సంక్షేమ పథకాలకు అర్హతలను నిరూపించుకోవటానికి ప్రజలు ధ్రువీకరణ పత్రాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే వీటి కోసం చేసుకున్న దరఖాస్తులు మీ సేవా కేంద్రాల దగ్గర వందల సంఖ్యలో మూలుగుతున్నాయి. వీటికి పరిష్కారం లభిస్తేనే అర్హులకు సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. పెరుగుతున్న కరోనా కేసులతో మీ-సేవలను కూడా మూసివేయించారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఆశలు పెట్టుకున్న ప్రజలు ప్రైవేటు ఈ-సేవ పాయింట్లు, నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన ఆ సెంటర్లవారు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.


కరోనా కాలంలోనే ప్రభుత్వం వరస సంక్షేమ పథకాలకు ఒకేసారి శ్రీకారం చుట్టింది. సంక్షేమ పథకాలకు అర్హతలను నిర్ణయించాలంటే అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించాల్సి ఉంటుంది. ప్రజలు ఈ పత్రాలను మీ-సేవ కేంద్రాల నుంచే పొందాలి. ఇందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు కీలకం. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ శాఖ జారీ చేయాలి. గతంలో రేషన్‌ కార్డులను ఆదాయానికి ప్రామాణికంగా తీసుకునే వారు. ఇప్పుడు రేషన్‌ కార్డులు కేవలం రైస్‌ కార్డులుగా మారిపోవడంతో ఆదాయాన్ని ధ్రువీకరించటం పెద్ద పనిగా మారింది. ఆదాయాన్ని నిర్దేశించటానికి అనేక ప్రామాణికతలను పరిశీలించాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ పత్రాలకు కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 


రెవెన్యూ కార్యాలయాలకు దరఖాస్తులు వెల్లువలా వస్తుండటంతో తహసీల్దార్లు మీ-సేవ కేంద్రాలపై పడుతున్నారు. కరోనాను కట్టడి చేయాల్సిన సమయంలో దరఖాస్తు విధానాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది.  సింగిల్‌ డెస్క్‌ విధానాన్ని ఏర్పాటు చేయడం, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, దరఖాస్తుదారుల ఇంటికే సిబ్బందిని పంపించి విచారణ చేయించి పత్రాలు జారీ చేయవచ్చు. ఇవేమీ చేయకుండా ధ్రువీకరణలు కావాలి.. మీ సేవలు పనిచేయవంటే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఎలా అందుతాయో జిల్లా యంత్రాంగానికే తెలియాలి. మీ-సేవల పునరుద్ధరణకు ఓ సమయం ఇవ్వాలి. లేదా ఆన్‌లైన్‌ మీ-సేవ సిటిజన్‌ పోర్టల్‌కు ప్రజలే లాగిన్‌ అయి దరఖాస్తులను స్వీకరించే విధానానికి అయినా ప్రాచుర్యం కల్పించాలి. ఇవేమీ చేయకుండా  మీ-సేవలను మూసివేయటం వల్ల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ అవసరం కోసం ప్రైవేటు నెట్‌ సెంటర్లను ఆశ్రయించి దోపిడీకి గురవుతున్నారు.


Updated Date - 2020-06-26T17:04:32+05:30 IST