కరోనా కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2020-05-13T09:20:24+05:30 IST

కరోనా కట్టడికి జిల్లాలో పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌

కరోనా కట్టడికి చర్యలు

విజయవాడ సిటీ, మే 12: కరోనా కట్టడికి జిల్లాలో పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో మరిన్ని వెంటిలేటర్లు సిద్ధం చేయాలనీ,  గ్రామ, వార్డు సచివాలయాల్లో క్వారంటైన్‌ కోసం 10 బెడ్లు సిద్ధం చేయాలని అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిల్లో 87 వెంటిలేటర్లు, పిన్నమనేనిలో 25 వెంటిలేటర్లకు అదనంగా మరిన్ని వెంటిలేటర్లను సిద్ధం చేయాలన్నారు.


రబీలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు,ఉపాధిహామీ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌, తాగునీటి సరఫరా అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్షించారు. రబీలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్‌ టన్నులు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామన్నారు. మామిడి పంటకు కిలో రూ.7.50 రేటు రైతులకు అందాలన్నారు. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన గ్రామీణ కూలీలను ఉపాధిహామీతో ఆదుకుంటామన్నారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు.


జిల్లాలో ఏర్పాటు చేసిన 34 క్వారంటైన్‌ కేంద్రాల్లో 1795 మంది అడ్మిట్‌ కాగా ఇప్పటి వరకు 1529 మంది డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. 17 పెయిడ్‌ క్వారంటైన్లను గుర్తించామన్నారు. వలస కార్మికుల కోసం 23 క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 10,967 మంది వలస కార్మికులను గుర్తించి వారిలో ఇప్పటికే 5 వేల మందిని మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు ప్రత్యేక ట్రైన్‌లలో పంపామన్నారు.  వైఎస్సార్‌ టెలీమెడిసిన్‌కు మంచి స్పందన లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 1353 మంది దీనిద్వారా మందులు పొందారన్నారు. రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు, సీపీ ద్వారకా తిరుమలరావు, జేసీ మాధవీలత, వీఎంసీ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌, ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్‌, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-13T09:20:24+05:30 IST