-
-
Home » Andhra Pradesh » Krishna » lockdown vijayawada airport
-
లాక్‌డౌన్‌లోకి.. విజయవాడ విమానాశ్రయం!
ABN , First Publish Date - 2020-03-24T16:09:09+05:30 IST
రవాణా రంగం సంపూర్ణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతోంది..

రవాణా.. లాక్‌డౌన్!
ఇక విమానాల వంతు
నేటి అర్ధరాత్రి నుంచి ఫ్లైట్స్ స్టాప్
నిలిచిపోనున్న 48 విమానాలు
నిలిచిపోయిన 1304 ఆర్టీసీ బస్సులు, 127 రైళ్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రవాణా రంగం సంపూర్ణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతోంది. పీటీడీ (ఆర్టీసీ) బస్సులను పూర్తిగా నిలిపివేయగా, రైల్వే శాఖ కూడా పూర్తిగా ప్రయాణికుల రైళ్లను నిలుపుదల చేసింది. తాజాగా లాక్‌డౌన్‌లోకి విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) కూడా చేరనుంది. నేటి అర్ధరాత్రి 12 గంటల నుంచి పూర్తిగా విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. మార్చి 31 వరకు సాధారణంగా ఇతర రవాణా వ్యవస్థలు లాక్‌డౌన్ ప్రకటించాయి. కానీ విమానయాన సంస్థ మాత్రం మార్చి 31 నాటికి నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులకు అందిన అధికారిక ఆదేశాల మేరకు నేటి అర్ధరాత్రి నుంచి సంపూర్ణంగా దూశంలోని వివిధ నగరాలతో విమాన సంబంధాలు తెగిపోతున్నాయి. తిరిగి మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి విమాన ఆపరేషన్స్ ఇక్కడి నుంచి సాగవు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, కడపలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ట్రూజెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు విమానాలను నడుపుతున్నాయి.
ప్రతి రోజూ 48 విమానాలు నడుస్తుంటాయి. ఈ 48 సర్వీసులు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఇక్కడ నుంచి సోమవారం 24 విమాన సర్వీసులు మాత్రమే రాకపోకలు సాగించాయి. మంగళవారం 26 విమాన సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. బుధవారం నుంచి ఒక్క విమానం కూడా నడవదు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఎక్కడివక్కడే షరా మూమూలుగా నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 1304 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దూరప్రాంతాలైన హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, భద్రాచలం, 282 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.
రవాణా రంగం సోమవారం పూర్తిగా స్తంభించింది. చత్తీస్‌గడ్, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాలకు వెన్నెల స్లీపర్, అమరావతి, గరుడ, ఇంద్ర, సూపర్ లగ్జరీ బస్సులు నిలిచిపోయాయి. నగర వ్యాప్తంగా 446 బస్సులు నిలిచిపోయాయి. వీటిలో సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఏసీ, మెట్రో డీలక్స్ బస్సులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా గ్రామీణ బస్సులు 253 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. వీటిలో పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులన్నీ గ్యారేజీలలో తలదాచుకున్నాయి.
ఆసియాలోనే అతిపెద్ద పీఎన్‌బీఎస్ రెండోరోజు కూడా ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది. రైళ్ల విషయానికి వస్తే విజయవాడ డివిజన్ పరిధిలో, నగరం మీదుగానూ రాకపోకలు సాగించే మొత్తం 127 రైళ్లు నిలిచిపోయాయి. వీటిలో 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగా 58 డెమూ రైళ్లు, 44 మెమూ రైళ్లు, 9 పాసింజర్ రైళ్లు ఉన్నాయి. విజయవాడ డివిజన్ నుంచి కేవలం కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు సరకు రవాణా మాత్రమే జరిగింది. విజయవాడ రైల్వేస్టేషన్ అత్యంత నిర్మానుష్యంగా ఉంది. ఇక లారీ రవాణా రంగం విషయానికి వస్తే .. సరిహద్దులలో జాతీయ రహదారులు మూసి వేయటంతో జిల్లా వ్యాప్తంగా 23వేల నేషనల్ పర్మిట్ లారీలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. మరో 2 వేల నేషనల్ పర్మిట్ లారీలు ఇప్పటికే బయలుదేరి తిరుగు ప్రయాణంలో ఆయా రాష్ర్టాలలో నిలిచిపోయాయి.
నిలిచిపోయిన వాహనాలను వెనక్కి రప్పించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ లారీ యజమానుల సంఘం అధ్యక్షులు వైవీ ఈశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి ఆర్డర్లు లేక బల్క్‌గా 15 వేల టిప్పర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నేటి నుంచి ఆంక్షల నేపథ్యంలో, పూర్తిగా జిల్లావ్యాప్తంగా 40 వేల లారీలు నిలిచిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 45 వేల ఆటోలు కూడా నేటి నుంచి నిలిచిపోనున్నాయి. రోడ్ల మీదకు వచ్చిన ఆటోలపై సోమవారం రవాణాశాఖ కొరడా ఝళిపించింది. మొత్తం 90 ఆటోలను సీజ్ చేసింది. నేటి నుంచి ఒక్క ఆటో రోడ్డు మీద తిరిగినా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.