కుదిరితే పేక.. వీలైతే! హౌసీ..

ABN , First Publish Date - 2020-04-26T09:19:54+05:30 IST

కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌ బంధాలన్నింటినీ బంద్‌ చేయడంతో అటు పురుషులు, ఇటు మహిళలు ..

కుదిరితే   పేక.. వీలైతే!    హౌసీ..

ఆంధ్రజ్యోతి - విజయవాడ: కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌ బంధాలన్నింటినీ బంద్‌ చేయడంతో అటు పురుషులు, ఇటు మహిళలు ఏంచేయాలో తోచక ‘ఆట’లకు తెరతీశారు. అపార్ట్‌ మెంట్లలో ఉన్న కుటుంబాలు పేకాటను ఎంచుకుంటే, వీధుల్లో ఉండే ఇరుపొరుగు ఇళ్లలోని మహిళలు హౌసీలు ఆడేస్తున్నారు. నగరంలో అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరిగిన తర్వాత ఒక్కో అపార్ట్‌మెంట్‌కు ఒక్కో సంక్షేమ సంఘం పుట్టుకొచ్చింది. పనులన్నీ పూర్తయ్యాక బాగా బోర్‌ కొట్టేయడంతో పేకముక్కలను తిప్పేస్తున్నారు. నాలుగైదు ఫ్లాట్లలో ఉన్నవాళ్లంతా కలిసి రోజుకో ఫ్లాట్‌లో సిట్టింగ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు.


ఏసీ ఆన్‌చేసుకుని చిన్నచిన్న పేకముక్కలను చల్లని గాలిలో గిరగిరా తిప్పేస్తూ కాలం గడిపేస్తున్నారు. సరదాగా ఆడితే కిక్‌ ఏం ఉంటుదని భావించారో ఏమో ఈ బాబులు భారీగా బెట్టింగ్‌లు మొదలెట్టేశారు. నగరానికి శివారు గ్రామీణ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో ఈ జూదం బాగా నడుస్తోంది. తాడిగడపలో కొద్దిరోజుల క్రితం ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట జోరుగా నడుస్తుందన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు దాడి చేశారు. వివిధ రంగాలకు చెందిన 12మంది ప్రముఖులు ఇక్కడ ముక్కలను చేతిలో పెట్టుకుని తెగ లెక్కలేస్తున్నారు. పోలీసులు వారిపై గాబ్లింగ్‌ చట్టంతోపాటు లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన చట్టం కింద కేసులు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్లన్నీ గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఉండడం, ఇక్కడ ఏం జరిగినా మూడో కంటికి తెలియదన్న నమ్మకంతో భారీ బెట్టింగ్‌లతో పేకాట నడుస్తోందని తెలుస్తోంది.


హాట్‌స్పాట్లలో ఉన్న వీధులతోపాటు వాటికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోని పలు వీధుల్లో మహిళలు, యువతులు హౌసీ పుస్తకాన్ని ముందు పెట్టుకుని ముమ్మరంగా ఆడేస్తున్నారు. కృష్ణలంక జీవీఆర్‌ వీధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పైపైకి వెళ్లిపోవడానికి సామూహికంగా ఆడిన ఈ హౌసీ ఒక కారణమని ఇప్పటికే తేల్చారు. పొంచి ఉన్న కరోనా ముప్పు గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇళ్లలో అయినా, వీధుల్లో అయినా సమూహాలుగా ఉండొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజల్లో మార్పు రాకపోవడం చాలా విచారకరమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం ప్రజలు వ్యవహరిస్తున్న తీరుపై మేధావులూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-26T09:19:54+05:30 IST