సామాజికవర్గమే కీలకం!

ABN , First Publish Date - 2020-03-12T09:42:28+05:30 IST

పల్లె పోరులో సామాజిక వర్గాలదే నిర్ణయాత్మక పాత్ర! రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో సైతం సామాజికవర్గాల ప్రాతిపదికనే చాలా వరకు ప్రజా తీర్పులు వెలువడుతుంటాయి.

సామాజికవర్గమే కీలకం!

జిల్లాలో గ్రామపంచాయతీల పరిధిలో 22,69,932 మంది ఓటర్లు 

ఎస్సీ ఓటర్లు 5,60,444 మంది 

ఎస్టీ ఓటర్లు 72,555 మంది 

బీసీ ఓటర్లు 9,46,934 మంది 

 అగ్రవర్ణ ఓటర్లు 6,89,999 మంది 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): పల్లె పోరులో సామాజిక వర్గాలదే నిర్ణయాత్మక పాత్ర! రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో సైతం సామాజికవర్గాల ప్రాతిపదికనే చాలా వరకు ప్రజా తీర్పులు వెలువడుతుంటాయి. ఏ సామాజిక వర్గం బలం ఎంత? ఎవరెటు ఉన్నారు? అనే అంశాలు ఇప్పుడు పల్లెపోరులో కీలకంగా మారనున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ ఓటర్లు విధానాల ప్రాతిపదికన విడిపోతారు. అటువంటి సందర్భాల్లో ఫలితాలు ఊహకు అందవు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే జిల్లా ఎన్నికల యంత్రాంగం పల్లెపోరులో భాగస్వామ్యమయ్యే ఓటర్లను సామాజిక వర్గాలుగా లెక్క తేల్చింది. జిల్లాలో సామాజిక సమీకరణల లెక్కపై ఆంధ్రఽజ్యోతి ప్రత్యేక కథనం... 


  స్థానిక ఎన్నికలకు సంబంధించి సామాజిక తరగతుల వారీగా ఓటర్ల విభజన జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇతరుల ప్రాతిపదికన ఓటర్ల లెక్క తీశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు మొత్తం 22,69,932 మంది ఉన్నారు. జాతీయ జనగణన - 2011 ప్రకారం జిల్లాలో   గ్రామీణ ప్రాంతాల్లో 28,45,864 జనాభా ఉంది. ఈ లెక్కన ఓటర్లు 22,69,932 మంది ఉండటం చూస్తే జనాభా/ఓటర్ల దామాషా సమతూకంతో ఉందని చెప్పవచ్చు. 


ఎస్టీ ఓటర్ల సంఖ్య 72,555 

 జిల్లాలో గ్రామ పంచాయతీల వారీగా మొత్తం 72,555 మంది ఎస్టీలున్నారు. వీరిలో పురుష ఓటర్లు 35,432 మంది ఉండగా, మహిళా ఓటర్లు 37,119 మంది ఉన్నారు. ఇతరులు నలుగురు ఉన్నారు. 2011 జనగణన ప్రకారం ఎస్టీల జనాభా 98,912 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 49,773 కాగా, మహిళలు 49,139 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు తక్కువ సంఖ్యలోనే ఉన్నా పోటీగా ఉండే స్థానాలలో నిర్ణయాత్మకమౌతుంటారు. ఈ వర్గం ఎవరిని ఆదరిస్తుందో చూడాల్సిందే ! 


ఎస్సీ ఓటర్ల సంఖ్య 5,60,444  

 జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కలిపి మొత్తం 5,60,444 మంది ఎస్సీ ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,75,351 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,85,068 మంది, ఇతర ఓటర్లు 25 మంది ఉన్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో పంచాయతీల పరిధిలో మొత్తం 6,81,037 మంది ఎస్సీ జనాభా ఉంది. వీరిలో పురుషులు 3,41,480 మంది, మహిళలు 3,39,557 మంది ఉన్నారు. అగ్రవర్ణాలు, బలహీన వర్గాల తర్వాత జిల్లాలో మూడవ స్థానంలో బలమైన ఓటర్లశక్తిగా ఈ వర్గం ఉంది. ఈ వర్గం ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. ఈ వర్గ ఓటర్లు ఒక అభిప్రాయంతో ఉంటారు. ఈ అభిప్రాయంలో మార్పు తీసుకు రాగలిగే అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడకగా ఉంటుంది. 


బలహీన వర్గాల ఓటర్ల సంఖ్య 9,46,934 

జిల్లాలో బలహీన వర్గాల ఓటర్లు 9,46,934 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 4,68,426 మంది కాగా, మహిళా ఓటర్లు 4,78,454 మంది ఉన్నారు. ఇతరులు 54 మంది ఉన్నారు. బలహీన వర్గాల ఓట్లు జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. ఈ వర్గం అత్యంత కీలకం. బలహీన వర్గాల ఓటర్లు జిల్లాలో మిశ్రమ స్పందనను చూపిస్తుంటాయి. సందర్భానుసారం తమ నిర్ణయాలను మార్చుకుంటాయి. అంశాల ప్రాతిపదికన బలహీన ఓటర్లు రాజకీయ పార్టీలను ఆదరిస్తుంటాయి. కాబట్టి ఈ సామాజికవర్గం రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతోంది. 


అగ్రవర్ణాల ఓటర్లు 6,89,999 

 జిల్లాలో అగ్రవర్ణాల ఓటర్లు 6,89,999 మంది ఉన్నారు. ఈ వర్గంలో పురుష ఓటర్లు 3,42,357 మంది, మహిళా ఓటర్లు 3,47,603 మంది ఉన్నారు. ఇతరులు 39 మంది ఉన్నారు. ఈ సామాజిక వర్గం నూటికి 90 శాతం నిశ్చితాభిప్రాయంతో ఉంటుంది. వీరిలో అంశాల ప్రాతిపదికన మార్పులు తీసుకురాగలిగిన అభ్యర్థుల గెలుపు వన్‌సైడ్‌ అని చెప్పుకోవచ్చు. జిల్లాలో బలహీన వర్గాల ఓటర్ల తర్వాత అతిపెద్ద సామాజిక వర్గ ఓటర్లుగా అగ్రవవర్ణాలు ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి బలహీన వర్గాల మద్దతు తోడైతే ఫలితం నిర్ణయాత్మకంగానే ఉంటుంది. అదే ఎస్సీలు కూడా  కలిసి వస్తే ఏకపక్షం అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో సామాజికవర్గంగా ఉన్నా, అంశాల ప్రాతిపదికన స్పందించే వారు, తటస్థుల కోణం కూడా ఉంటుంది. ఈ కోణాలు కూడా సమతూకంతో ఉన్నప్పుడు సామాజిక వర్గ సమీకరణం విజయవంతం అవుతుంది. లేకపోతే  విభిన్నమైన ఫలితాలు వస్తుంటాయి. 

Updated Date - 2020-03-12T09:42:28+05:30 IST