వెనక్కి తగ్గం.. అమరావతిని పోరాడే సాధించుకుంటాం

ABN , First Publish Date - 2020-10-07T15:45:59+05:30 IST

33 వేల ఎకరాల పచ్చని పంట పొలాలను రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని కోసం..

వెనక్కి తగ్గం.. అమరావతిని పోరాడే సాధించుకుంటాం

అమరావతి జేఏసీ నిర్ణయం

12తో ఉద్యమానికి 300 రోజులు

11 నుంచి ఉద్యమ కార్యాచరణ

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీర్మానం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): 33 వేల ఎకరాల పచ్చని పంట పొలాలను రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని కోసం, రైతులు త్యాగం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు ముక్కలాట ప్రారంభమైంది. రైతులు, మహిళలు న్యాయం కోసం రోడ్డెక్కారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని ఉద్యమం ప్రారంభమై ఈనెల 12వ తేదీకి 300 రోజులు పూర్తవుతుంది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి పునాదులు పడి ఐదేళ్లవుతోంది. ఈ తరుణంలో ఉద్యమాన్ని మరింత వేడెక్కించాలని నిర్ణయించింది అమరావతి జేఏసీ. దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది. జేఏసీ కన్వీనర్‌ శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ, వామపక్ష నేతలతోపాటు వివిధ ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. 11వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 5కే రన్‌ నిర్వహించాలని, అదే రోజు జాతీయస్థాయిలో మహిళలతో వెబ్‌నార్‌ నిర్వహించాలని, 12న అన్ని తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించారు.


మూడు రాజధానులు రాష్ట్రాభివృద్ధికి విఘాతం  

రాజధాని సమస్యను కొందరు చాలా తేలిగ్గా తీసుకుంటు న్నారు. రాబోయే రోజుల్లో ఇది పెద్ద దెయ్యంగా పట్టుకుం టుంది. మూడు రాజధానులు రాష్ట్రాభివృద్ధికి విఘాతం. రాజధానితోపాటు ప్రత్యేకహోదా, విభజన హామీలు అవసరం. ఇక్కడి అధికార పక్షం, ప్రతిపక్షం, ఇతర పక్షాలు వద్దన్నా కేంద్రానికి మద్దతునిచ్చే పరిస్థితులున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ పాసిపోయిన లడ్డు అన్న పెద్దాయన బీజేపీ పంచన చేరారు. అమరావతి పరిరక్షణ సమితి రూపొందించే ప్రణాళికకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుంది. 

- పి.మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి


అక్కసుతో నాశనం చేయడం సరికాదు 

అభివృద్ధి ఒకరి వల్ల జరిగేది కాదు. చంద్రబాబుపై అక్కసుతో అమరావతిని నాశనం చేయడం తగదు. మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు వామపక్షాలు విజయవాడను రాజధాని చేయాని డిమాండ్‌ చేశాయి. ఇప్పుడు అనాలోచితంగా సీఎం మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. 

- కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


న్యాయస్థానాల ద్వారానే బుద్ధి చెప్పాలి

అమరావతిపై ప్రతిఒక్కరికీ బాధ్యత ఉంది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి వచ్చే వారికి అమరావతి నేలపై ప్రేమ ఉండదు. రాజధానిని ముక్కలు చేయాలనుకున్న దుర్మార్గులకు న్యాయస్థానాల ద్వారానే బుద్ధి చెప్పాలి. 

 - గోపాలకృష్ణమూర్తి, అఖిల భారత హిందూ వాహిని సభ


తల్లిదండ్రులు ఇదే సంస్కారం నేర్పారా?

అమరావతిని స్పీకర్‌ తమ్మినేని సీతారాం శ్మశానంతో పోల్చారు. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎడారి అన్నారు. మరో ఉపముఖ్యమంత్రి లకారంతో తిట్లను ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు మీకు నేర్పిన సంస్కారం ఇదేనా? న్యాయవాదుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.100కోట్లను ఖర్చు చేసింది. కొత్తగా పదవిలోకి వచ్చిన మంత్రి విమానాల్లో వెళ్లిన వారు రైతులా? అంటున్నారు. ఆయనకు తెలియదేమో కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు 100 ఏళ్లుగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఆయన మంత్రి పదవిలోకి వచ్చే వరకు విమానం ఎక్కి ఉండకపోవచ్చు. 

 - శివారెడ్డి, జేఏసీ కన్వీనర్‌

జగన్‌పైనే పోరాటం 

జగన్‌ అహంకారం ఆయనకు రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా చేస్తోంది. మనం జగన్‌పైనే పోరాటం చేయాలి. జగన్‌కు అమరావతి పేరు ఎత్తితే చంద్రబాబు గుర్తుకొస్తున్నారు. దళితుల నోట్లో మట్టి కొడుతున్న ఆయనకు వారి ఉసురు తగులుతుంది.  

- వర్ల రామయ్య, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు


ప్రపంచ చరిత్రలో నిలిచే పోరాటం ఇది 

అమరావతి ఉద్యమం ప్రపంచ చరిత్రలో నిలిచి పోతుంది. ఇక్కడ పోరాటం కొత్తకాదు. టీడీపీ హయాంలోనూ మేం పోరాటం చేశాం. నాడున్న సమస్యలను ఆయా మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రే అమరావతిని నాశనం చేస్తున్నారు. అమరావతి రైతులు రాజధానికి భూములు ఇవ్వడం గొప్ప చరిత్ర. ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టి అవాస్తవాలను చెబుతోంది.

- మేళం భాగ్యారావు, దళిత సంఘ నేత


మా పిల్లలు టీవీలు చూడడం మానేశారు 

మంత్రులు అమరావతి రైతుల గురించి చులకనగా మాట్లాడుతున్నారు. వారిలా సంస్కారం మరచి, దిగజారి మేము మాట్లాడలేం. విమా నంలో ఢిల్లీకి వెళ్తే ఎగతాళి చేస్తున్నారు. అమరావతిలో రైతులు వ్యవసాయం చేస్తూనే తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మా పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. మంత్రులు మాట్లాడుతున్న భాషకు మా పిల్లలు టీవీలు చూడడం మానేశారు. 

- శిరీష, దళిత మహిళా రైతు

ప్రాధాన్యాలు కాదు.. పోరాటం ముఖ్యం 

అమరావతినే కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో ప్రాధాన్యాలు ముఖ్యం కాదు. పోరాటాన్ని ఎంత ఉవ్వెత్తున్న చేస్తున్నామన్నదే ప్రధానం. అమరావతి సమస్యను కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ వద్దకు పీసీసీ నేతలు తీసుకెళ్లారు. దీనిపై ఆయన త్వరలోనే స్పందిస్తారు. 

- సుంకర పద్మశ్రీ, పీసీసీ ఉపాధ్యక్షురాలు

వికేంద్రీకరణ ఒక డ్రామా

వికేంద్రీకరణ ఒక పెద్ద డ్రామా. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు దీనితో ముడిపడి ఉన్నాయి. అమరావతికి మద్దతుగా ఈనెల 12న గుంటూరు, విజయవాడల్లో జనసేన సామూహిక దీక్ష చేపడుతుంది. 

 - పోతిన వెంకట మహేష్‌, జనసేన అధికార ప్రతినిధి
Read more