ఎట్టకేలకు చేపట్టారు

ABN , First Publish Date - 2020-12-26T05:52:24+05:30 IST

ఎట్టకేలకు చేపట్టారు

ఎట్టకేలకు చేపట్టారు
నున్నలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌

ఒకటా రెండా.. నెలల తరబడి నాన్చుతూ వస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నంలో జరిగిన జిల్లాస్థాయి కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గొనగా, నున్నలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. చాన్నాళ్ల తరువాత తమ కల నెరవేరడంపై పేదలు ఆనందం వ్యక్తం చేశారు.  


జగన్‌ హామీని నెరవేర్చారు : వంశీ

నున్నలో ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ

విజయవాడ రూరల్‌, డిసెంబరు 25 : గన్నవరం నియోజకవర్గంలోని వైఎస్సార్‌, జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల పండుగ నున్నలోని మోడల్‌ టౌన్‌షిప్‌లో శుక్రవారం  వైభవంగా జరిగింది. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ ఈ పట్టాలను పంపిణీ చేశారు. అంబాపురం, పి.నైనవరం, పాతపాడు, నున్నకు చెందిన 2,028 మందికి పట్టాలను పంపిణీ చేశారు. తొలుత ఎమ్మెల్యే వంశీ బోడపాడులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి, చెరువు సెంటరులోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని మాజీ సర్పంచ్‌ కర్రె విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేకును కట్‌ చేశారు. అక్కడి నుంచి లబ్ధిదారులతో కలిసి మోడల్‌ టౌన్‌షిప్‌ వరకు పాదయాత్ర చేశారు. నున్నలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన మోడల్‌ టౌన్‌షిప్‌ లే అవుట్‌ను ప్రారంభించిన వంశీ అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం నిర్మాణానికి, పేదల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించాక నున్నలో పట్టాల పంపిణీ ప్రారంభమైంది. 

నవరత్నాలు నచ్చే వైసీపీలోకి..

అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో వంశీ మాట్లాడుతూ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు నచ్చడం వల్లే ఆయనకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలుచేయడం తెలుగుదేశం పార్టీలోని కొందరు సహించలేకపోయారని, చివరకు అసెంబ్లీలో కూడా కూర్చోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. జగన్‌ ఎన్నికలకు ముందు చెప్పినట్టు రాష్ట్రంలో 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. పదవుల కోసమో, ఆస్తులను కాపాడుకునేందుకో తాను జగన్‌కు మద్దతు పలకలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. రాష్ట్రంలో తనకు ఎలాంటి వ్యాపారాలు, ఆస్తులు లేవన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, మల్లవల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు, రామవరప్పాడులో ఇళ్ల తొలగింపు విషయంలో ప్రజల పక్షానే నిలిచానన్నారు. రాష్ట్రంలో సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థ ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివన్నారు. జిల్లాలోనే అత్యధికంగా గన్నవరంలో పట్టాల పంపిణీ చేస్తున్నామని, తొలిదశలో రానివారికి రెండో దశలో పట్టాలు ఇప్పిస్తామని వంశీ హామీ ఇచ్చారు. 

ఘన స్వాగతం

అంతకుముందు శివాచార్య మామిళ్లపల్లి ఫణికుమార్‌ వేద మంత్రోచ్ఛారణ మధ్య విజయవాడ రూరల్‌ తహసీల్దార్‌ బి.సాయి శ్రీనివాస్‌ నాయక్‌, ఎంపీడీవో జుజ్జవరపు సునీత తదితరులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన వంశీని వైసీపీ నాయకులు, అధికారులు ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ మాదు శివరామకృష్ణ, వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి, నున్న పీఏసీఎస్‌ అధ్యక్షుడు, గన్నవరం ఏఎంసీ డైరెక్టర్‌ పోలారెడ్డి సాంబిరెడ్డి, గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు), మాజీ వైస్‌ ఎంపీపీ జీతం శ్రీనివాసరావు, వైసీపీ బీసీ అధ్యయన కమిటీ శాశ్వత ఆహ్వానితుడు బొమ్మిన శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వరరావు (ఆర్వీఆర్‌), మండల కన్వీనర్‌ దేవగిరి ఓంకార్‌రెడ్డి, పార్టీ నాయకులు కోనేరు సుబ్బారావు, శీలం రంగారావు, సువర్ణరాజు, సమ్మిట సాంబశివరావు, పోలారెడ్డి చంద్రారెడ్డి, బెజవాడ కోటేశ్వరరావు, దావు వెంకటేశ్వరరావు, నల్లమోతు చంద్రశేఖర్‌, భీమవరపు శివరామిరెడ్డి, అంగజాల హనుమాన్‌, వికాస్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు నరెడ్ల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 పేదల సొంతింటి కల నెరవేరుస్తాం

ఇబ్రహీంపట్నం ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రులు

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 25 : పేదల సొంతింటి కల నెరవేర్చుతామని మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. అనంతరం కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ జిల్లాలోని 49 మండలాల్లో మొత్తం 3,02,420 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మొత్తం ఆరు దఫాలుగా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ వరకు లబ్ధిదారులకు పట్టాలను పంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-26T05:52:24+05:30 IST