దోచేయ్‌.. అమ్మేయ్‌..

ABN , First Publish Date - 2020-11-27T06:16:20+05:30 IST

దోచేయ్‌.. అమ్మేయ్‌..

దోచేయ్‌.. అమ్మేయ్‌..
ఎన్జీవో కాలనీలో ఆక్రమణను యంత్రాలతో తొలగించుకుంటున్న పట్టాదారు

జగ్గయ్యపేట ఎన్జీవో కాలనీలో అక్రమాలు

ఖాళీ జాగా కనిపిస్తే పాగా

దొంగ పట్టాలు సృష్టించి చౌకధరకు అమ్మకాలు

రోజురోజుకూ పెరుగుతున్న వివాదాలు

అక్కడ సెంటు భూమి అసలు ధర రూ.2లక్షలు. కానీ, 2.5 సెంట్ల భూమిని రూ.50వేలకే అమ్మేస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేయడం, పట్టాలు సృష్టించేయడం, ఆనక అమాయకులకు చౌకగా అమ్మేయడం.. పాత తహసీల్దార్‌ అండతో ఓ ముఠా గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న ఈ అక్రమ బాగోతం జగ్గయ్యపేటలోని ఎన్జీవో కాలనీలో రోజుకో ఘర్షణకు దారితీస్తోంది. అవినీతిని అరికట్టి అక్రమార్కులను అదుపుచేయాల్సిన అధికారులు నోరెత్తకపోవడంతో ఈ ప్రాంతం తరచూ వివాదాలమయమవుతోంది. 

జగ్గయ్యపేట : జగ్గయ్యపేటలోని ఎన్జీవో కాలనీ కొంతమంది అక్రమార్కులకు వరంగా మారింది. 1981లో అప్పటి ఉద్యోగులకు ఆర్‌ఎస్‌ నెంబరు 158లో నామమాత్రపు ధరకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను కొందరు దొడ్డిదారిన చేజిక్కించుకుని అమాయకులకు చౌకగా అమ్మేస్తున్నారు. ఈ ప్రాంతంలో సెంటు రూ.2 లక్షలకు పైగా ఉండగా, వీరు 2.5 సెంట్ల ప్లాట్లను రూ.50వేలకు ఇస్తున్నారు. పాత తహసీల్దార్‌ పేరు మీద కొంతకాలంగా వస్తున్న పట్టాలు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. సదరు తహసీల్దార్‌తో సన్నిహితంగా ఉన్న కొందరు విలేకరులు, వ్యక్తులు ఇప్పటికీ ఎన్జీవో కాలనీలో ప్లాట్లకు పట్టాలు ఇప్పిస్తామని పైరవీలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 

ఖాళీ ప్లాట్‌ కనిపిస్తే కబ్జా

ఎన్జీవో కాలనీలో ప్లాట్లు పొందిన ఉద్యోగులు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ కావటం, కొందరు రిటైర్‌ అవ్వటం, ఇంకొందరు కాలం చేయటంతో ఆ ప్లాట్లపై అక్రమార్కులు దృష్టి సారించారు. స్తంభాలు పాతి, విద్యుత్‌ మీటర్లు ఏర్పాటుచేసి, హక్కును పొందినట్టు చూపటం, తర్వాత తాత్కాలికంగా రేకుల షెడ్డువేసి, పురపాలక సంఘం నుంచి పన్ను వేయించుకోవటం, డోర్‌ నెంబర్‌ను తెప్పించుకోవడం చేస్తున్నారు. ఇదంతా చేసేందుకు ఒక ముఠా పాత తహసీల్దార్‌తో సంప్రదింపులు జరిపి పట్టాలు ఇప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కాలనీలో అనేక ప్లాట్లను పొందిన ముఠా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తోంది. ఈ ప్రాంతంలో సెంటు రూ.2 లక్షలు ఉండగా, వీరు తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఈ ముఠాలకు ఎన్జీవో కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో ప్రధాన బాధ్యుడిగా పనిచేసిన వ్యక్తి సంపూర్ణ సహకారం ఉందని తెలుస్తోంది. ఐదు నెలల క్రితం కొత్తవారు అసోసియేషన్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే, అధికారికంగా పట్టాలు పొందిన ఉద్యోగులు కాకుండా ఇతర వ్యక్తులు ఎవరున్నారు, వారికి పట్టాలు ఎలా  సంక్రమించాయో అసోసియేషన్‌ తెలుసుకునే ప్రయత్నంలో పడింది. ఇంతా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమ దృష్టికి సమస్యలు రాలేదని, ఒకరిద్దరు వచ్చినా లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వటం లేదంటున్నారు. ఇటీవల రోజూ ప్లాట్ల యజమానులకు, వాటిని కబ్జా చేసిన వ్యక్తులకు మధ్య వివాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.  ప్లాట్లపై ఫిర్యాదులు వస్తున్నా అక్రమార్కులపై చర్యలు లేవు. బాధితులంతా బలహీన వర్గాలకు చెందినవారు కావటంతో న్యాయం జరగట్లేదు. 

పోలీసులకు ఫిర్యాదు చేయాలి

ఎన్జీవో కాలనీలో ప్లాట్లు కబ్జాకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారి నుంచి లేఖ వస్తే అసలు పట్టాదారుడి వివరాలు వెల్లడిస్తాం. ప్రభుత్వం ఒకసారి బీఫాం పట్టా ఇస్తే వాటి పరిరక్షణ బాధ్యత పట్టాదారుడిదే. ఎన్జీవో కాలనీపై  తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారితో విచారణ చేయించాలని కలెక్టర్‌ను కోరాం. విషయం వారి పరిశీలనలో ఉంది. తాజాగా పట్టాలు పొందినవారెవరూ మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయలేదు. - రామకృష్ణ, తహసీల్దార్‌


కరోనా ః 45,000

జూ అధికారికంగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 630 

జూ కొత్తగా 162 మందికి వైరస్‌  జూ ఇద్దరు మృతి జూ 115 మంది డిశ్చార్జి 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా కేసులు 45వేలు దాటాయి. ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్య 630. రెండు నెలలుగా జిల్లాలో వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ క్రమంగా విస్తరించి విషం చిమ్ముతోంది. దీంతో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గురువారం 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతిచెందారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45,052కు చేరాయి. బాధితుల్లో 115 మంది గురువారం డిశ్చార్జి అయ్యారు. ఇంకా 1,694 మంది చికిత్స పొందుతున్నారు.

Read more