మా భూములు లాక్కోవద్దు

ABN , First Publish Date - 2020-03-02T09:53:39+05:30 IST

ఐదు దశాబ్దాలకుపైగా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో జాతీయ రహదారి (బైపాస్‌) పక్కనే సాగు చేసుకుంటున్న 21.40 ఎకరాల డ్రెయినేజీ పోరంబోకును ప్రభుత్వం నివేశన స్థలాలకు పంపిణీ చేయాలని ..

మా భూములు లాక్కోవద్దు

లక్ష్మీపురం (చల్లపల్లి), మార్చి 1: ఐదు దశాబ్దాలకుపైగా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో జాతీయ రహదారి (బైపాస్‌) పక్కనే సాగు చేసుకుంటున్న 21.40 ఎకరాల డ్రెయినేజీ పోరంబోకును ప్రభుత్వం నివేశన స్థలాలకు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తుండడంతో ఆవేదన చెందిన రైతులు పురుగు మందు డబ్బాలు చేతబూని ఆందోళనకు దిగారు. సర్వే రాళ్లు పాతి లే అవుట్‌ వేసేందుకు ఆదివారం అధికారులు రావడంతో రైతులు పొలంలోనే బైఠాయించారు. దీంతో చేసేది లేక రెవెన్యూ అధికారులు వెనుతిరిగారు. 


పేదల భూమి తీసుకుని పేదలకు పంచి పెడతారా?

పేదల భూమిని తీసుకుని పేదలకు పంచి పెడతారా అని భూమిని సాగు చేసుకుంటున్న రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. గుండేరు డ్రెయినేజీ పోరంబోకుగా ఉన్న పల్లపు ప్రదేశాన్ని పూడ్చుకుని 55 ఏళ్లుగా దానిపై ఆధారపడి జీవిస్తున్నామని, పంట చేతికి వచ్చే సమయాన మినుము పైరు దున్నించేశారని వారు వాపోయారు. ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు కోరారు. ప్రభుత్వ అధికారుల మొండిగా తమ భూములు తీసుకోవాలని చూస్తే పురుగు మందే శరణ్యమని పేద రైతు లక్ష్మీపురం లక్ష్మి కన్నీటి పర్యంతమైంది.


ఆందోళనకు టీడీపీ మద్దతు

రైతుల ఆందోళనకు టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు. స్థలాల పంపిణీకి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదన్నారు. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు భూములు కొనుగోలు చేసి ఇవ్వాలని, పేదల సాగుభూములు లాక్కోవడం సరికాదన్నారు. రైతులతోపాటు ఈ కార్యక్రమంలో జన్ను యానాది, బోలెం సాయిబాబు, కనకమేడల వాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T09:53:39+05:30 IST