3 నుంచి కృష్ణా జిల్లాలో జాబ్‌మేళాలు
ABN , First Publish Date - 2020-11-15T15:53:16+05:30 IST
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో..

కృష్ణా(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణా కమిటీ, దిశా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈనెల మూడో వారం నుంచి జాబ్‌మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంతవరకు 3,26,917 మంది రైతులు ఇ-క్రాప్‌లో నమోదయ్యారన్నారు. 801 గ్రామ సచివాలయాలు, 796 రైతు భరోసా కేంద్రాలు, 658 వైఎస్సార్ రూరల్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టామని, వీటిని మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో జాప్యం లేకుండా చూడాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో 15 గ్రామాల్లో అవసరమైన విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయాలన్నారు.