లాసెట్‌లో కృష్ణా జిల్లాకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు

ABN , First Publish Date - 2020-11-06T16:56:41+05:30 IST

ఏపీ లాసెట్‌-2020 ఫలితాల్లో..

లాసెట్‌లో కృష్ణా జిల్లాకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు

పీజీఎల్‌ సెట్‌లో ద్వితీయ ర్యాంకు 


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): ఏపీ లాసెట్‌-2020 ఫలితాల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు లభించింది. మూడేళ్ల లాసెట్‌, ఐదేళ్ల పీజీఎల్‌సెట్‌ పరీక్ష ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. మూడేళ్ల లా కోర్సు పరీక్షలో విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన 53 సంవత్సరాల టి.రవీంద్రబాబు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా.. ఐదేళ్ల పీజీఎల్‌సెట్‌ పరీక్షలో విజయవాడ శివారు పోరంకి గ్రామానికి చెందిన చలసాని అహల్య రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించారు. ఇంకా మూడేళ్ల లాసెట్‌లో విజయవాడ కృష్ణలంకకు చెందిన టి.విజయరాజ్యలక్ష్మి రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు, విజయవాడ పటమటకు చెందిన లంకే విజయకిరణ్‌ రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించగా... ఐదేళ్ల పీజీఎల్‌సెట్‌లో పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ఉప్పల తోషిత రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. 


ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయాలనే..  

సమాజాన్ని పట్టిపీడిస్తున్న కీలకమైన సమస్యలపై ఉన్నత న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌) దాఖలు చేసి.. వేరే లాయరుకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేనే సొంతంగా వాదించాలనే లక్ష్యంతోనే 53 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రంలో పట్టా సాధించేందుకు లాసెట్‌ రాశాను. లాసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ముందే ఊహించాను. స్ట్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. మా సొంతూరు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఓ గ్రామం. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయికి జాబ్‌ వచ్చింది. చిన్నబ్బాయి హైదరాబాద్‌లో ఆర్కిటెక్చర్‌ కోర్సు చదువుతున్నాడు. నా భార్య గృహిణి. న్యాయశాస్త్రం చదవాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచీ ఉంది. ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత లా చేద్దామనుకున్నాను. ఇంకా ఏడేళ్లు సర్వీసు ఉండగానే వలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నందున లాసెట్‌ రాశాను. హైకోర్టులో కొన్నాళ్లు ప్రాక్టీసు చేసిన తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాను 

- రవీంద్రబాబు, స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌

Updated Date - 2020-11-06T16:56:41+05:30 IST