మామిడి ఫలం అందేనా!

ABN , First Publish Date - 2020-03-16T10:52:55+05:30 IST

మామిడి ఫలం అందేనా!

మామిడి ఫలం అందేనా!

ఆగిరిపల్లి :  మెట్టరైతాంగానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మామిడి ఈ ఏడాది రైతును దగా చేసింది. దిగుబడులు దారుణంగా ఉండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా సంక్షోభంలో మామిడిపై ప్రభుత్వం దృష్టి సారించక పోవడంతో ఏటా రైతుకు కష్టాలు తప్పడం లేదు.  మామిడి ఎగుమతులను ప్రోత్సహించి, దళారుల వ్యవస్థను నిర్మూలించి డిమాండ్‌ మేరకు వచ్చే ధరను రైతుకు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  


ఈ ఏడాది ఆరంభంలో ఆశాజనకంగా కనిపించిన పరిస్థితి వాతావరణంలో వచ్చిన మార్పులతో పూర్తిగా మారిపోయింది. ఆరంభంలో  వచ్చిన పూత కురిసిన అకాల వర్షాలకి దెబ్బ తింది.  మాగుడు వాతావరణంతో వచ్చిన పూత మాడిపో యింది. పూత పిందెకట్టు కాకుండానే రాలిపోయింది. ఫలితంగా ఈ ఏడాది దిగుబడి కనిష్ఠస్థాయికి పడిపోయింది. పంట దిగుబడి తగ్గడంతో డిమాండ్‌ పెరిగి ధర వస్తుందని మామిడి రైతులు ఆశలు  పెంచుకున్నారు. రైతుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సీజన్‌లో  బంగినపల్లి టన్ను 70వేలు, తోతాపురి  టన్ను రూ.50 వేలు, రసాలు రూ.40 వేల వరకు ధర పలికాయి. మామిడిలో రారాజుగా పేరొందిన బంగినపల్లి దిగుబడి ఏటా తగ్గుతున్నా, తోతాపురం, రసాలు వంటి రకాల కాయల దిగుబడులు ఆశాజనకంగానే ఉంటున్నాయి.   ఈ ఏడాది తోతాపురి, రసాల దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది కంటే ఎక్కువగా ధరలు ఉంటేగానీ రైతులు గట్టెక్కే పరిస్థితి లేదు. వివిధ మార్కెట్లలో మామిడికి డిమాండ్‌ ఉండి ధరలు ఉన్నా మధ్య దళారులు సొమ్ము రైతులకు అందకుండా దోచేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది.  


ప్రభుత్వాల నిర్లక్ష్యం

నూజివీడు మామిడికి దేశవ్యాప్తంగానే  కాకుండా, ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు ఉన్నా రైతుల దశ మాత్రం తిరగలేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణే దీనికి కారణం. మామిడిరైతు సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్‌ కోసం దీర్ఘకాలికమైన ప్రణాళికలు రూపొందించక పోవడంలో విఫలం కావడంతో   మామిడి రైతుల పరిస్థితి  ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది.  గిట్టుబాటు కల్పించేందుకు మామిడి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా చొరవ చూపకపోవడంతో మామిడి రైతులు ఇతర రాష్ట్రాల వ్యాపారులపైన, దళారులపైనే ఆధారపడాల్సి వస్తుంది. 


అనుబంధ పరిశ్రమలు ఏవి 

మామిడి పంటకు అనుగుణంగా నూజివీడు ప్రాతంలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు  కాకపోవడంతో రైతాంగం మామిడి సాగుకు  దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మామిడి జ్యూస్‌, తాండ్ర, పల్ప్‌, పచ్చళ్లు, ఆమ్‌చూర్‌, ఎసెన్స్‌ తయారీ పరిశ్రమలు   ప్రాంతంలో ఏర్పాటు కాకపోవడంతో మామిడి  పండించిన రైతులు ఇతర రాష్ట్రాలకు తమ ఉత్పత్తులను  ఎగుమతి చేయాల్సి వస్తుంది.


చీడపీడల ప్రభావం 

మామిడి పంటకు చీడపీడల వల్లే సంక్షోభం వచ్చింది. నివారణ సాధ్యం కాని మసి, మంగుతెగులు మామిడి ఉనికిని ప్రశ్నించే  స్థాయికి చేరుకోవడంతో నాణ్యత దెబ్బతిని మామిడి మార్కెట్లో చెలామణి కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతాంగం మామిడ తోటలు నరికివేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. ఈ తెగుళ్ల నియంత్రణపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఫ్రూట్‌ కవర్లతో వినియోగం అవశ్యం  

మామిడిలో ఫ్రూట్‌ కవర్ల వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉద్యాన వన శాఖ ద్వారా హెక్టారుకు 2500 కవర్లను ఉచితంగా అందిస్తున్నాం. వీటి వల్ల టన్నుకు 300 కేజీల దిగుబడి పెరగడంతో పాటు నాణ్యత వల్ల రెట్టింపు  ధర వస్తుంది.  వీటి వినియోగంపై రైతులను బాగా చైతన్య పరుస్తున్నాం.  మామిడి దిగుబడి గత ఏడాది కంటే ఎక్కువ వస్తుందని భావిస్తున్నాం. ఇంకా సన్న పింద దశలోనే చాలా తోటలు ఉన్నాయి. అప్పుడే కచ్చితమైన దిగుబడి అంచనా వేయలేం.

- దయాకర్‌బాబు, ఏడీ, హార్టికల్చర్‌

Updated Date - 2020-03-16T10:52:55+05:30 IST