భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో.. చిన్ననాటి స్నేహితుడిని..
ABN , First Publish Date - 2020-10-04T16:14:55+05:30 IST
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో చిన్ననాటి స్నేహితుడిని..
అనుమానం పెనుభూతమై..
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో స్నేహితుడిని హతమార్చిన లారీ డ్రైవర్
లారీతో తొక్కించి ఘాతుకం
మృతుడు, నిందితుడిది కంచికచర్ల
సెప్టెంబరు 5న బొబ్బిలిలో ఘటన
సెల్ సిగ్నల్ ఆధారంగా కేసు ఛేదన
బొబ్బిలి(కృష్ణా): భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో చిన్ననాటి స్నేహితుడిని అమానుషంగా హతమార్చాడు ఓ లారీ డ్రైవర్. ముందస్తు ప్రణాళికతో జిల్లాలు దాటించి సుదూర ప్రాంతం తీసుకొచ్చాడు. పూటుగా మద్యం తాగించి..లారీతో తొక్కించి ఆనవాళ్లు మిగల్చకుండా హత్యచేశాడు. తనకేమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. చివరకు మృతుడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. బొబ్బిలి డీఎస్పీ పాపారావు శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు.
కంచికచర్లకు చెందిన మూల్పురి రామ్‌గోపాల్ (29), తోట నాగేంద్రబాబు (చంటి) చిన్ననాటి స్నేహితులు. రామ్‌గోపాల్ ఆస్ట్రేలియాలో పీజీ చేశాడు. చంటి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 26న గుజరాత్‌కు లారీ లోడుతో వెళ్తున్నానని..వస్తే అన్నీ చూపిస్తానని చంటి చెప్పడంతో రామ్‌గోపాల్ వెళ్లాడు. గుజరాత్‌కు కెమికల్ లోడుతో వెళ్లి, తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి టైల్స్ లోడ్‌తో బొబ్బిలికి సెప్టెంబరు 5న వచ్చారు. సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ షాపు వద్ద అన్‌లోడ్ చేసి, ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో లారీని నిలిపారు. క్లీనర్ సాయితేజను భోజనానికి హోటల్‌కు పంపించారు. కొద్దిసేపటి తరువాత క్లీనర్ లారీ కేబిన్‌లో నిద్రపోయాడు.
ముందస్తు ప్రణాళికలో భాగంగా రామ్‌గోపాల్‌తో అర్ధరాత్రి వరకూ చంటి పూటుగా మద్యం తాగించాడు. అపస్మారకస్థితికి చేరుకున్న రామ్‌గోపాల్‌ను గ్రోత్ సెంటర్ వద్దకు తీసుకొచ్చి రోడ్డుపై పడేశాడు. పలుమార్లు లారీతో తొక్కించడంతో మృతదేహం ఆనవాళ్లు లేకుండా పోయింది. ఎవరికీ అనుమానం కలుగకుండా లారీని వేరే మార్గంలో మళ్లించి విజయనగరం మీదుగా విశాఖకు చేరుకున్నాడు. రామ్‌గోపాల్ ఎక్కడ అని క్లీనర్ సాయితేజ అడిగితే, రూ.3 వేలు తీసుకొని విశాఖ వెళ్లిపోయాడని, టిప్పర్ ఢీకొని మృతిచెందాడని మరోసారి పొంతన లేకుండా సమాధానం చెప్పాడు. విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించాడు.
గుర్తుతెలియని మృతదేహంగా కేసు
నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహానికి పోలీసులు అక్కడే పోస్టుమార్టం చేయించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్టు కేసు నమోదుచేశారు. ఇంతలో రామ్‌గోపాల్ అదృశ్యమైనట్టు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ బొబ్బిలి పరిసరాల్లో ఉన్నట్టు సూచించాయి. విషయాన్ని విజయవాడ పోలీసులకు సమాచారమందించడంతో ఎస్సైలు చదలవాడ సత్యనారాయణ, వి.ప్రసాదరావు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ నాగేంద్రబాబు నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రామ్‌గోపాల్ తానూ స్నేహితులమని..తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో హత్య చేసినట్టు నాగేంద్రబాబు ఒప్పుకున్నాడు.