బెజవాడలో కలశ జ్యోతుల కాంతులు
ABN , First Publish Date - 2020-12-30T06:32:18+05:30 IST
కలశ జ్యోతుల కాంతులతో విజయవాడ నగరం మెరిసింది.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కలశ జ్యోతుల కాంతులతో విజయవాడ నగరం మెరిసింది. భవానీ నామస్మరణతో నగరం పులకించింది. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కలశ జ్యోతుల మహోత్సవం కన్నుల పండువగా సాగింది. భవానీ భక్తులు కలశ జ్యోతులను చేతపుచ్చుకుని, సాయంత్రం సత్యనారాయణ పురం శివరామ క్షేత్రం నుంచి ఊరేగింపుగా కనకదుర్గానగర్‌కు చేరుకుని, అమ్మవారికి కలశ జ్యోతులను సమర్పించారు. ఆలయ స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, ప్రధానార్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఈవో సురేశ్‌బాబు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, కలశ జ్యోతుల ఊరేగింపును ప్రారంభించారు. పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఉత్సవంలో పాల్గొన్నారు.