జనతా కర్ఫ్యూకు జై

ABN , First Publish Date - 2020-03-21T10:15:36+05:30 IST

కరోనా వైరస్‌ నిర్మూలనకు జనతా కర్ఫ్యూ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు జిల్లా వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తుతోంది.

జనతా కర్ఫ్యూకు జై

రేపు డీజిల్‌, పెట్రోల్‌ బంకుల మూసివేత

సంఘీభావం తెలిపిన జిల్లా డీజిల్‌, పెట్రోల్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, పశ్చిమ కృష్ణా ఏపీఎన్జీవోలు,  ఏపీ చాంబర్స్‌ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కరోనా వైరస్‌ నిర్మూలనకు జనతా కర్ఫ్యూ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు జిల్లా వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును జిల్లాలో నూరు శాతం అమలు చేయడానికి స్వచ్ఛందంగా పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రజలు రోడ్లపైకి రాకుండా ఉండడానికి ఆ రోజున వాహనాలకు డీజిల్‌, పెట్రోల్‌ పోయబోమని జిల్లా పెట్రోల్‌ అండ్‌ డీజిల్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుంచు నరసింహారావు ప్రకటించారు. నగర, జిల్లా వ్యాప్తంగా డీజిల్‌, పెట్రోల్‌ బంకులు ఆ రోజున పనిచేయవని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీ వాహనాలైన అంబులెన్సులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక వాహనాలకే డీజిల్‌, పెట్రోల్‌ పోస్తామన్నారు. ప్రజలంతా జనతా కర్ఫ్యూను విజయవంతం చేసి కరోనా వైరస్‌ రహిత దేశంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రోజున డీలర్లు, సిబ్బంది బయటకు రారని, అత్యవసర వాహనాలను దృష్టిలో ఉంచుకుని బంకుల్లో ఒకరిద్దరు సిబ్బంది ఉంటారని ఆయన తెలిపారు.


31 వరకు సభలు, సమావేశాలకు దూరం 

జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అసోసియేషన్‌ సంఘీభావం ప్రకటించింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు, నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ నెల 31 వరకు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని అసోసియేషన్‌ నిర్ణయించిందన్నారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ పర్యవేక్షణలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలను జిల్లా ఉద్యోగులు బాధ్యతతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యాసాగర్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-21T10:15:36+05:30 IST