కరోనా కల్లోలంలోనూ ఆగని దోపిడీ
ABN , First Publish Date - 2020-04-26T09:15:38+05:30 IST
కరోనా కల్లోలంతో ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంటే.. అక్రమార్కులు మాత్రం అరనిమిషం కూడా తమ నైజాన్ని పక్కన పెట్టట్లేదు.

బుడమేరు వాగును ఆక్రమించి ఇసుక తరలింపు
వెల్వడం (మైలవరం రూరల్), ఏప్రిల్ 25 : కరోనా కల్లోలంతో ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంటే.. అక్రమార్కులు మాత్రం అరనిమిషం కూడా తమ నైజాన్ని పక్కన పెట్టట్లేదు. ఎవరికి వారు ఇళ్లకే పరిమితమైన వేళ, అధికారులు బిజీగా ఉన్న సమయంలో బుడమేరు వాగును ఆక్రమించుకోవడమే కాకుండా ఇసుకను పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగంలో ఓ వైసీపీ నాయకుడు, ప్రభుత్వ పదవి పొందిన వ్యక్తి ఉండటం విశేషం.
ఇదేం అక్రమం..!
మండల పరిధిలోని వెల్వడం గ్రామం బయట నుంచి బుడమేరు వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులోని ఇసుకను అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రూ.1,300 ప్రభుత్వ ఫీజు చెల్లించి స్థానికులు ఇసుకను తరలించుకుంటున్నారు. బుడమేరు వాగు పక్కనే పొలాలు ఉన్న కొందరు రైతులు వాగును ఆక్రమించుకున్నారు. సుమారు నాలుగైదు ఎకరాల వాగు రైతుల ఆక్రమణల్లోనే ఉంది. పదేళ్లుగా ఆ భూమిలో పెద్దఎత్తున ఇసుక నిల్వ చేశారు.
నిల్వ చేసిన ఇసుకను ప్రభుత్వ ఫీజు చెల్లించి ట్రాక్టర్ యజమానులు తరలించుకుంటున్న సమయంలో ఆక్రమిత రైతులు అడ్డు తగిలి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఆ రైతులను బెదిరించి నిల్వచేసిన ఇసుక కుప్పలను తన ట్రాక్టర్ల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. బయట వ్యక్తులైతే ఒక్కో ట్రాక్టర్ యజమాని నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నాడు. శనివారం ఏకంగా జేసీబీని ఏర్పాటుచేసి ట్రాక్టర్లలో లోడు చేసేందుకు ప్రయత్నించాడు.
అదేమంటే ఇసుకపై మట్టి ఉందని, కూలీలు ఇసుకను లోడుచేసే సమయంలో మట్టిని తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే జేసీబీని ఏర్పాటు చేసుకున్నానని సమాధానం చెప్పాడు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటుచేసి ఇసుక రవాణాను పెద్దఎత్తున సాగిస్తున్నాడు. ఒక్కో ట్రక్కు ఇసుకను రూ.4వేల నుంచి రూ.5వేల వరకు అమ్ముతున్నారు.గ్రామంలో ఇసుక కుంభకోణం ఇంత పెద్దఎత్తున జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.
బయటకొస్తే క్రిమినల్ కేసులే!
విజయవాడ, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సెంచరీ దాటేయడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఇక నుంచి అకారణంగా రహదారులపైకి వచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్, పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు.
అకారణంగా రహదారులపైకి వచ్చిన వాహనాలను సీజ్ మాత్రమే చేస్తామని అనుకుంటే పొరపాటని, దానికి అదనంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో కృష్ణలంకలో మహారాష్ట్రలో కరోనాను తగిలించుకుని ఇంటికొచ్చిన లారీడ్రైవర్ నిర్వాకంపైనా కలెక్టర్ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్మికనగర్, కృష్ణలంక ప్రాంతాల్లో తబ్లిక్ జమాతే, ఎన్నారైలతో లింక్‌లు లేకపోయినా కరోనా వ్యాప్తి చెందడాన్ని ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు.