సందట్లో సడేమియా!

ABN , First Publish Date - 2020-04-07T09:37:22+05:30 IST

సందట్లో సడేమియా!

సందట్లో సడేమియా!

గుడివాడలో అడ్డగోలుగా భూదందాలు

రెచ్చిపోతున్న మంత్రుల అనుచరులు

రూ.35 కోట్ల విలువైన స్థలాలపై కన్ను

బెజవాడలో కూరగాయల పంపిణీ పేరుతో వసూళ్లు


(విజయవాడ- ఆంధ్రజ్యోతి/గుడివాడ): గుడివాడ సమీపంలోని పేద, మధ్యతరగతి ప్రజల ప్లాట్లపై మంత్రి అనుచరుల కన్నుపడింది. లాక్‌డౌన్‌ సమయం.. ఎవ్వరూ బయటకు వచ్చే సాహసం చేయరు. అధికారులూ వారి హడావిడిలో వారుంటారు. ఇదే మంచి  అదనుగా భావించారేమో సదరు మంత్రి అనుచరులు బరితెగించారు. ప్లాట్లు ఉన్న లేఔట్‌లోకి చొరబడి సర్వే రాళ్లు తొలగించారు. విద్యుత్‌ స్తంభాలను కూలగొట్టారు. షామియానాలు వేసుకుని దర్జాగా పేకాడుతూ ఆ స్థలాల్లో సేదదీరుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన స్థల యజమానులకు చంపేస్తాం దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరిస్తున్నారు. అధికారులు వద్దకు వెళితే కరోనా హడావిడిలో ఉన్నామని తప్పించుకుంటున్నారు. 


బెజవాడలో అధికార పార్టీ నేత తన నియోజకవర్గంలో భారీగా కూరగాయల పంపిణీ చేపట్టారు. ఇదంతా తన సొంత డబ్బుతో చేస్తున్నట్టు బిల్డప్‌ ఇస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యాపారి నుంచి కూరగాయల పంపిణీ పేరుతో లక్షలాది రూపాయలను వసూలు చేశారు. వాటిలో కొంత మొత్తం ఖర్చు పెడుతూ తన జేబులో డబ్బులు ఖర్చుపెడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని కూరగాయల పంపిణీలో అసలు భాగస్వాములైన వ్యాపారులు సణుగుతున్నారు.


జిల్లాలో కరోనా లాక్‌డౌన్‌ పేద, మధ్యతరగతి జీవితాలను తలకిందులు చేస్తుంటే మంత్రుల దందాలకు చక్కని అవకాశం కల్పిస్తుందనడానికి పై ఉదంతాలే నిదర్శనం. అధికారులు ప్రజల సమస్యలు వినే స్థితిలో లేరు. అందరూ కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. అధికారపార్టీ నేతలకు కావాల్సింది అదే. ఈ సందట్లో దందాలకు తెరదీశారు. మంత్రుల అనుచరుల పేరుతో కొందరు బరితెగిస్తుంటే.. కొందరు ఎమ్మెల్యేలే తమ వారిని ఉసిగొల్పి అడ్డగోలు దందాలకు తెరదీస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు బార్ల ఓనర్లను బెదిరించి మద్యం నిల్వలకు బయటకు తీసుకొస్తున్నారు. దాన్ని అనధికారికంగా విక్రయిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. మరోవైపు భవన నిర్మాణ పనులు నిలిచిపోయినా ఇసుక అక్రమరవాణా ఆగడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమరవాణా చేయిస్తూ అయినకాడికి దండుకుంటున్నారు. 


గుడివాడలో భారీ భూదందా.. 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు రోడ్లపైకి రావడానికి వీల్లేదు. గుడివాడలో ఇదే అదనుగా భావించిన మంత్రి అనుచరులు పేద, మధ్యతరగతి ఇళ్ల స్థలాలను ఆక్రమించుకునే పనిలో పడ్డారు. గుడివాడ బైపాస్‌రోడ్డును ఆనుకుని వలివర్తిపాడు గ్రామ పరిధిలో సుమారు 8.64 ఎకరాలను 1984లో ఒక భూస్వామి తరపున పవర్‌ఆఫ్‌ అటార్నీ తీసుకున్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఒక విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి కలిసి లేఔట్‌ వేసి 65 ప్లాట్లను విక్రయించారు. కొనుగోలు చేసిన వారంతా పేద, మధ్యతరగతి ప్రజలే. తరువాత రియల్‌భూమ్‌ రావడంతో స్థలాల విలువ పెరిగిపోయింది. దీంతో పవర్‌ ఆఫ్‌ అటార్నీ రాసిన భూస్వామికి దురాశ పుట్టింది. తాను పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎవరికీ ఇవ్వలేదని అడ్డం తిరిగాడు. దీంతో స్థల యజమానులు అందరూ చైతన్యనగర్‌ హౌసింగ్‌  సొసైటీగా ఏర్పడి లేఅవుట్‌ క్రమబద్ధీకరణ కోసం డీటీసీపీకి దరఖాస్తు చేశారు. వీరి అభ్యర్థనను సీఆర్‌డీఏ 2017లో ఆమోదించింది.


స్థలాల యజమానులు ఇటీవల విద్యుత్‌ శాఖకు రూ.25 లక్షలు చెల్లించి విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కోరారు. విద్యుత్‌ శాఖ స్తంభాలు వేసింది. ఎప్పటి నుంచో ఆ స్థలాలపై కన్నేసిన మంత్రి అనుచరులు రంగప్రవేశం చేశారు. స్థలాల్లో ఉన్న సర్వే రాళ్లను తొలగించారు. విద్యుత్‌ స్తంభాలు కూల్చివేశారు. అక్కడే షామియానాలు వేసుకుని పేకాడుతూ తాము భూయజమానులు ఎవ్వరూ అటు రావ్వదని బెదిరిస్తున్నారు. నిలదీస్తే దాడులకూ తెగబడుతున్నారు. వీరి దందాపై స్థల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండటం లేదు. దీనికి మంత్రి ఒత్తిళ్లే కారణమని స్థల యజమానులు ఆరోపిస్తున్నారు. మంత్రిని ఆదర్శంగా తీసుకుని, సమీప నియోజకవర్గం ఎమ్మెల్యే సైతం తనకు నచ్చిన స్థలాలను రాత్రికి రాత్రి ఆక్రమించేస్తున్నారు. 


బెజవాడ నేత రూటే సపరేటు

బెజవాడలో అధికార పార్టీ నేత దందాల తీరే వేరుగా ఉంటుంది. ఈయన నియోజకవర్గంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు రోజూ ఉచితంగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. దీని కోసం వ్యాపారుల నుంచి రూ.5వేలు చొప్పున సుమారు రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అయితే ఆ డబ్బు నుంచి పైసా తీయకుండా హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి కూరగాయలు ఉచితంగా తెప్పించుకుంటూ వాటిని పేదలకు పంచుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేత వద్ద పనిచేసే ఓ అనుచరుడు మాస్కుల డిమాండ్‌ను గుర్తించి వాటితో వ్యాపారం చేశాడు. మంత్రి పేరు చెప్పి హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి మాస్కులను తక్కువ ధరకు భారీ ఎత్తున కొనుగోలు చేశారు. అనంతరం వాటిని రిటైల్‌ వ్యాపారులకు ఎక్కువ ధరలకు అమ్మి సుమారు రూ.10 లక్షలు వెనకేసుకున్నాడు. కరోనా దెబ్బకు తినడానికి తిండి లేక పేదలు అల్లాడుతుంటే అధికార పార్టీ నేతలు మాత్రం కరోనా పేరుతో వీలైనంత వెనకేసుకుంటున్నారు. 


Updated Date - 2020-04-07T09:37:22+05:30 IST