కారు దహనం కేసులో

ABN , First Publish Date - 2020-08-18T09:54:36+05:30 IST

భారతీనగర్‌లో కారులో జరిగిన హత్యాయత్నం వెనుక ఆరు నెలల నుంచి సాగుతున్న వివాదాల మూలాలు కనిపిస్తున్నాయి. నలుగురుతో విజయవాడ-తాడేపల్లి మధ్య తిరిగి

కారు దహనం కేసులో

 భూ ఆర్థిక వివాదాలే కారణం


 విజయవాడ, ఆంధ్రజ్యోతి : భారతీనగర్‌లో కారులో జరిగిన హత్యాయత్నం వెనుక ఆరు నెలల నుంచి సాగుతున్న వివాదాల మూలాలు కనిపిస్తున్నాయి. నలుగురుతో విజయవాడ-తాడేపల్లి మధ్య తిరిగిన కారును భారతీనగర్‌లో దహనం చేశాడు మంగళగిరి రూరల్‌ మండలం రామచంద్రాపురానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. 


డబ్బే ప్రధాన కారణం

గుండగుత్తి గంగాధర్‌ అలియాస్‌ బాబీ, నాగవల్లి కుమారి దంపతులు వెటర్నరీ కాలనీలో ఉంటూ బీఆర్టీఎస్‌ రోడ్డులో కార్ల కొనుగోలు, అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యనారాయణపురానికి చెందిన వి.కృష్ణారెడ్డి, రామచంద్రాపురానికి చెందిన వేణుగోపాల్‌ రెడ్డితో భూముల కొనుగోలు వ్యాపారానికి దిగారు. కొన్నాళ్ల క్రితం వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్‌ కలిసి ఒక భూమి కొనుగోలుకు పెట్టుబడి పెట్టారు.


ఇందులో వేణుగోపాల్‌రెడ్డికి గంగాధర్‌ సుమారు రూ.1-2 కోట్ల బకాయి ఉన్నాడు.  వేణుగోపాల్‌రెడ్డి డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో తాడేపల్లిలో భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తానని గంగాధర్‌ చెప్పాడు. నెలలు గడస్తున్నా రిజిస్ట్రేషన్‌ కాలేదు. గంగాధర్‌, నాగవల్లికి కృష్ణారెడ్డి అండగా ఉన్నాడు.


పక్కా పథకంతోనే..

డబ్బు అందలేదన్న కోపంలో ఉన్న వేణుగోపాల్‌ రెడ్డి.. తహసీల్దార్‌ ఒకాయన  భూమిని కొనడానికి సిద్ధంగా ఉన్నాడని, మాట్లాడుకుందాం రమ్మని గంగాధర్‌కు ఫోన్‌ చేశాడు. గంగాధర్‌, నాగవల్లి కుమారి, కృష్ణారెడ్డి ఏపీ16 డీసీ 4534 వ్యాగనర్‌ కారులో సోమవారం మధ్యాహ్నం బయల్దేరారు. అప్పటికే వేణుగోపాల్‌రెడ్డి కృష్ణలంకలోని స్ర్కూబ్రిడ్జి వద్ద ఉన్నాడు. మద్యం సీసాలో పెట్రోలు పోసి పాలిథిన్‌ కవర్‌లో పెట్టుకున్నాడు. తాడేపల్లిలో ఉన్న అవర్‌ ప్లేస్‌ హోటల్‌ వద్దకు, తర్వాత ఖలీల్‌భాయ్‌ హోటల్‌కు తీసుకెళ్లాడు.


అక్కడి నుంచి మళ్లీ విజయవాడకు తీసుకొచ్చాడు. పార్టీ నోవాటెల్‌ హోటల్‌కు వస్తుందని చెప్పి కారును అక్కడికి తీసుకొచ్చి కెనరా బ్యాంక్‌ ముందు ఆపించాడు. ముందు సీట్లో ఉన్న గంగాధర్‌ దంపతులను వెనుక సీట్లోకి పంపేశాడు. డ్రైవింగ్‌ సీట్లో వేణుగోపాల్‌రెడ్డి ఎక్కి, తన పక్క సీట్లో కృష్ణారెడ్డిని కూర్చోబెట్టుకున్నాడు. భూమి విషయంలో తేడా వస్తే పెట్రోలు పోసి తగలబెట్టేస్తానని కృష్ణారెడ్డిని బెదిరించి కవర్‌లో ఉన్న సీసా పైకి తీసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. వెంటనే కారు డోర్లకు లాక్‌వేసి దిగి పారిపోయాడు. అనంతరం వేణుగోపాల్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. కృష్ణారెడ్డి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు.


గంగాధర్‌, నాగవల్లి కుమారి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులతో మాట్లాడిన గంగాధర్‌ మాత్రం తనకు, వేణుగోపాల్‌రెడ్డికి వివాదాలు లేవన్నాడు. కృష్ణారెడ్డితో ఎలాంటి వివాదాలు ఉన్నాయో తెలియదన్నాడు. కథ మాత్రం గంగాధర్‌ దంపతుల చుట్టూనే తిరుగుతోంది.

Updated Date - 2020-08-18T09:54:36+05:30 IST