అందరూ ఉన్నా.. అనాథలా!

ABN , First Publish Date - 2020-11-25T06:29:19+05:30 IST

ఓ వ్యక్తి మృతదేహానికి గ్రామస్తులే బంధువులై అంత్యక్రియలు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన మండలంలోని పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.

అందరూ ఉన్నా.. అనాథలా!

తండ్రి చనిపోయాడని తెలిసీ పట్టించుకోని బిడ్డలు

గ్రామస్తులు, బంధువులే అంత్యక్రియలు నిర్వహణ 

పోచంపల్లిలో హృదయ విదారక ఘటన

జగ్గయ్యపేట రూరల్‌, నవంబరు 24: కనుమరుగువుతున్న సంబంధ బాంధ్యవాలు ఒకవైపు.. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే మానవత్వం మరోవైపు... ఈ రెండు భావాలు ఒకే ఘటనలో మంగళవారం కనిపించాయి. రక్తసంబంధీకులు అంతా ఉండీ పట్టించుకోని... ఓ వ్యక్తి మృతదేహానికి గ్రామస్తులే బంధువులై  అంత్యక్రియలు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన మండలంలోని పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తేళ్లూరి అప్పిరెడ్డి (54) కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. రోజులు గడిచేకొద్దీ ఇంట్లో నుంచి మృతదేహం వాసన రావటం స్థానికులు గమనించారు. హైదరాబాద్‌లో ఉంటున్న అతని భార్యకు సమాచారమిచ్చారు. 25 ఏళ్ల క్రితం భర్తతో విభేదించి పిల్లలతో కలిసి వెళ్లిపోయిన ఆమె కడసారి చూపునకూ రాలేదు. ప్రతి సంవత్సరమూ పిల్లలొచ్చి కొద్ది రోజులుండి వెళ్లేవారు. సోమవారం ఒక కుమార్తె అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. బంధువులు హిందూ సంప్రదాయం ప్రకారం భార్య చేయాల్సిన  క్రతువులు నిర్వహించాలని చెప్పటంతో అన్యమతం స్వీకరించిన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, ఇక్కడ పరిస్థితులు వివరించి  తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అంతిమ సంస్కారాలకు రాలేమని కుటుంబ సభ్యుల నుంచి బదులొచ్చింది. స్థానికులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు కలిసి మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. 

Updated Date - 2020-11-25T06:29:19+05:30 IST