-
-
Home » Andhra Pradesh » Krishna » housing
-
ఇళ్ల పట్టాల్లో లాటరీకి స్వస్తి
ABN , First Publish Date - 2020-12-27T06:34:24+05:30 IST
లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల పట్టాలను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ విధానానికి స్వస్తి పలికి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చెప్పిన ప్రకారమే కేటాయిస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది.
పంపిణీలో అధికార పార్టీ నేతల జోక్యం
వారు సూచించిన ప్రదేశంలోనే లబ్ధిదారునికి స్థలం
తమ వారికి సొంత ఊళ్లో.. ఇతరులకు దూరంగా
మూడొంతుల గ్రామాల్లో ఇదే పరిస్థితి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల పట్టాలను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ విధానానికి స్వస్తి పలికి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చెప్పిన ప్రకారమే కేటాయిస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. సేకరించిన భూములన్నీ ఒకే ప్రాంతంలో లేకపోవడంతో గ్రామాల్లో గుర్తించిన లబ్ధిదారులకు కొందరికే స్థానికంగా ఇళ్ల పట్టాలు దక్కుతున్నాయి. మరికొందరికి వేరే ప్రాంతాల్లో కేటాయించాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో లాటరీ పద్ధతిలో కేటాయించినట్లయితే వివాదాలు తలెత్తకుండా పంపిణీ సాఫీగా పారదర్శకంగా జరిగేది. కానీ లాటరీ పద్దతికి స్వస్తి పలికి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచించిన వారికి సొంత గ్రామాల్లో, ఇతరులకు బయట ప్రాంతాల్లో ఇస్తున్నారు. జిల్లాలో దాదాపు మూడొంతుల గ్రామాల్లో ఇదే తంతు నడుస్తోంది. లబ్ధిదారుల పట్టాలు కూడా పేరు, చిరునామాతోనే ప్రింట్ అయి వస్తున్నాయి. సర్వే నెంబర్ ఆప్షన్ ఖాళీగా ఉంటోంది. ఈ ఖాళీలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచించిన ప్రదేశంలోని ప్లాట్ నెంబర్లను తహసీల్దారు వేస్తున్నారు.
ఇక్కడా ఓటు బ్యాంకు రాజకీయమే!
ఒక ఊరిలో స్థానిక లే అవుట్‌లో ప్లాటు దక్కని వారికి కనీసం సమీపంలోని ఊరి పరిధిలోనైనా ఇస్తే దగ్గరగా ఉంటుంది. అలాకాక, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో కేటాయిస్తున్నారు. దీంతో అనేకమంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకే అప్పగించటంతో తమ ఓటు బ్యాంకుకు అనుగుణంగానే వారు లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల అధికార పార్టీలోని ఇతర గ్రూపులకు చెందినవారు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ రెండు రోజుల్లోనే అనేక ప్రాంతాల్లో ఇలాంటి వివాదాలు తలెత్తాయి. ముందుముందు ఇంకెన్ని వివాదాలు వెలుగు చూస్తాయో చూడాల్సిందే.
లబ్ధిదారుల టెన్షన్
జిల్లావ్యాప్తంగా సీఆర్‌డీఏ పరిధిలో ఎంపిక చేసిన వారిని మినహాయుస్తే, ఈ వారంలో మొత్తం 3,01,171 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నారు. వీటి పంపిణీని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించటంతో ఆ దిశగానే జరుగుతోంది. ఇలా చేయడం వల్ల ఒక్క రోజులో పూర్తి కావాల్సిన కార్యక్రమం వారం రోజులు సాగుతోంది. ఎమ్మెల్యేలు రోజుకు పది గ్రామాల్లో తిరగాలి. అన్నిచోట్లా అట్టహాసంగా కార్యక్రమాలను నిర్వహించటం రెవెన్యూకి కూడా తలనొప్పిగా మారుతోంది. జరుగుతున్న పరిణామాలను చూసి... ఎమ్మెల్యేల ద్వారానే కార్యక్రమాలు నడుస్తుండడంతో రాజకీయాలు జరిగి, తమకు ఏమైనా నష్టం వాటిల్లుతుందేమోనని లబ్ధిదారులు భయపడుతున్నారు. అర్హత సాధించినా.. కాలాతీతం కారణంగా లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంటోంది.