‘పట్టా’ పోరు

ABN , First Publish Date - 2020-12-05T06:26:07+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీ తేదీ దగ్గరకొస్తున్నకొద్దీ రెవెన్యూ అధికారులకు అధికారపార్టీ నేతల నుంచి వస్తున్న జాబితాలు పెరిగిపోతున్నాయి.

‘పట్టా’ పోరు

‘స్థానిక’ ఎన్నికలను దృష్టిలో ఉంచకుని ఓట్ల రాజకీయం 

అనుచరులు, తమ వర్గ ప్రజలతో కూడిన జాబితాలు సిద్ధం 

అందరి జాబితాలను ఆన్‌‘లైన్‌’లోకి చేర్చాలని ఒత్తిళ్లు 

తమవల్ల కాదంటున్న తహసీల్దార్లు 


ఇంటి పట్టా వ్యవహారం ఇంతింత కాదయా అన్నట్టుంది జిల్లాలో పరిస్థితి. ఈ వ్యవహారంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల తీరు తహసీల్దార్ల తలబొప్పి కట్టిస్తోంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికారపక్ష ప్రజా ప్రతినిధులు సరికొత్తగా ఓట్ల రాజకీయానికి తెరతీశారు. ఈ నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ ఉండటంతో వారం నుంచి జిల్లావ్యాప్తంగా తహసీల్దార్లపై అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల ఒత్తిడి పెరిగిపోయింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఇళ్ల పట్టాల పంపిణీ తేదీ దగ్గరకొస్తున్నకొద్దీ రెవెన్యూ అధికారులకు అధికారపార్టీ నేతల నుంచి వస్తున్న జాబితాలు పెరిగిపోతున్నాయి. ఈ జాబితాలను తహసీల్దార్ల టేబుల్‌ దగ్గరకు పంపించి, ఆన్‌లైన్‌ చేయాలని ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే అంచనాను మించి దరఖాస్తులు వచ్చాయని, వాటి కోసం స్థల సేకరణే తలనొప్పిగా మారిందని, ఇప్పుడు మళ్లీ అదనంగా వచ్చే దరఖాస్తులను ఎలా ఆన్‌లైన్‌ చేయగలమంటూ కొందరు తహసీల్దార్లు వాటిని పక్కన పెడుతున్నారు. ఈ సమస్యను పట్టించుకోని ప్రజా ప్రతినిధులు ఆన్‌లైన్‌ చేయాల్సిందేనని మొండిపట్టు పట్టడంతో తహసీల్దార్లలో కూడా సహనం నశిస్తోంది. కొందరు ధైర్యం చేసి, ‘ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు చేశాం. ఇక మా వల్ల కాదు. మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి బదిలీ చేయించేయండి.’ అనే పరిస్థితి తలెత్తింది.


జిల్లాలో ఇళ్ల స్థలాల జాబితా 1.71 లక్షల నుంచి 3.41 లక్షలకు చేరుకుంది. పంపిణీ వాయిదా పడిన ప్రతిసారీ దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతోంది. సేకరించిన భూముల కంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉండటంతో తొలి దశలో అందరికీ చోటు కల్పించటం దాదాపు దుర్లభంగా మారింది.. ఈ స్థితిలో అధికార పార్టీ నేతలు అదనపు దరఖాస్తులను తీసుకువచ్చి ఆన్‌లైన్‌ చేయాలని ఒత్తిడి తేవడం తలనొప్పిగా మారింది. పంపిణీ గడువు దగ్గర పడటంతో.. తహసీల్దార్లు పట్టాలను సిద్ధం చేయటంతో పాటు, కొత్త లే అవుట్లలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాల్సి ఉంది. రోడ్లను చదును చేయించాలి. ఇన్ని పనుల మధ్య అధికార పార్టీ నేతలు అదనపు జాబితాలతో ఒత్తిళ్లు తెస్తుండడం తహసీల్దార్లకు ఇబ్బందిగా మారింది. 

Updated Date - 2020-12-05T06:26:07+05:30 IST