ఇదో ‘చెత్త’ నిర్ణయం!

ABN , First Publish Date - 2020-09-13T14:37:07+05:30 IST

గ్రామీణ ప్రాంత ప్రజానీకంపై ప్రభుత్వం చెత్త భారం మోపింది. గ్రామ పంచాయతీల..

ఇదో ‘చెత్త’ నిర్ణయం!

ఇంటి పన్ను రూ.400.. చెత్త చార్జీ రూ.720

చెత్త చార్జీ వసూలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాల్లో వ్యతిరేకత


నందిగామ రూరల్(విజయవాడ)‌: గ్రామీణ ప్రాంత ప్రజానీకంపై ప్రభుత్వం చెత్త భారం మోపింది. గ్రామ పంచాయతీల ద్వారా ఉచితంగా చెత్తను సేకరిస్తుండగా కొత్తగా పొడి, తడిచెత్త పేరుతో ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. పక్కా గృహ ఇంటి పన్నుకు దాదాపు రెట్టింపుగా చెత్తచార్జీ చెల్లించాల్సి వస్తోంది. దీనిపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


గ్రామాల్లో వలంటీర్ల ద్వారా చెత్తచార్జీ వసూలు చేస్తున్నారు. నందిగామ మండలంలో 23 గ్రామాల్లో  సోమవరం, లింగాలపాడు గ్రామాలను స్వచ్ఛభారత్‌ కింద ఎంపిక చేశారు. సోమవరంలో 450 కుటుంబాలు, లింగాలపాడులో 473 కుటుంబాలున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా రోజుకు 2 రూపాయలు చార్జీ చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.720 భారం పడుతోంది. సంవత్సరానికి 450 కుటుంబాలున్న గ్రామంలో రూ.3.24 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో శ్లాబ్‌ ఉన్న పక్కా గృహానికి ఏడాదికి ఇంటి పన్ను రూ.400 వసూలు చేస్తున్నారు. అదే ఇంట్లో చెత్త తీసుకెళ్లినందుకు మాత్రం ఏడాదికి రూ.720 వసూలు చేస్తున్నారు. దీనిపై ఆయా గ్రామస్తుల నుంచి త్రీవ అసంతృప్తి వ్యక్తమవుతోంది.


పన్ను నెల క్రితం లింగాలపాడులో గ్రామస్తులు నిరసన కూడా చేపట్టారు. ప్రస్తుతం ఆరు నెలలుగా కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రతి కుటుంబం ఆర్థింకగా చితికిపోయింది. దీంతోపాటు లాక్‌డౌన్‌తో పనులు దొరకటం కష్టంగా మారింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం గ్రామాల్లో ఇంటి పన్నులు కట్టలేని పరిస్థిల్లో ఉన్నామని ప్రజలు వాపోతుండగా చెత్తపై పన్ను మరో పెనుభారంగా మారింది.


చెత్త పన్ను కట్టం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామాల్లో పరిస్థితులు సరిగా లేవు. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంటి పన్ను కట్టడమే కష్టంగా ఉంది.  చెత్త పేరుతో పన్నులు  వసూలు చేయడం విడ్డూరంగా ఉంది. చెత్త పన్ను కట్టం.

- చిరుమామిళ్ల వెంకయ్య, లింగాలపాడు


ఇది మోసపూరితమే

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత. కేంద్రం ఇచ్చే స్వచ్ఛభారత్‌ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులకు ప్రజల నుంచి రుసుం వసూలు చేయడమేంటి? ఇది మోసపూరితమే. 

-తలమాల డేవిడ్‌రాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు 

Updated Date - 2020-09-13T14:37:07+05:30 IST