నివేశన స్థలాల కేటాయింపుపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2020-03-21T10:10:29+05:30 IST

తెలుగురావుపాలెం గ్రామానికి చెందిన దళితుల సాగులోని భూములను నివేశన స్థలాలకు కేటాయింపు ఆపాలని హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది.

నివేశన స్థలాల కేటాయింపుపై హైకోర్టు స్టే

తెలుగురావుపాలెం దళితుల స్వాధీనంలోని భూముల్లో  ప్లాట్ల కేటాయింపు

నాలుగు  వారాలు ఆపాలని ఆదేశం


ఘంటసాల, మార్చి 20: తెలుగురావుపాలెం గ్రామానికి చెందిన దళితుల సాగులోని భూములను నివేశన స్థలాలకు కేటాయింపు ఆపాలని హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది. తెలుగురావుపాలెం దళితవాడ సమీపంలో ఆర్‌.ఎస్‌.నెంబరు 16/2లో నాలుగు ఎకరాల 18 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని గ్రామానికి చెందిన తలకటూరి సోమశేఖర్‌, మట్టా వెంకటేశ్వరమ్మ, గాలిమోతు వాసయ్య, మట్టా కిషోర్‌, పైడిపాముల ప్రశాంతి, మునిపల్లి రాజమ్మ, గూడవల్లి బేబీసరోజిని, పెదపూడి దాసు కుటుంబాలకు చెందిన వారు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి తమదేనంటూ రెవెన్యూ అధికారులు నివేశన స్థలాల కేటాయింపునకు యత్నిస్తున్నారు. వారసత్వంగా అనుభవిస్తున్న ఆ భూమిని అధికారులు లాక్కుంటున్నారని దళితులు కోర్టును ఆశ్రయించారు. 


లే అవుట్‌ సిద్ధం

దళితుల స్వాధీనంలోని భూముల్లో రెవెన్యూ అధికారులు నివేశన స్థలాల కేటాయింపునకు లే అవుట్‌ను సిద్ధం చేశారు. ఆ భూములు మావేనని దళితులు వేడుకున్నా పోలీసుల సాయంతో  రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 138 మందికి నివేశన స్థలాలు ఇచ్చేందుకు లే అవుట్‌ను సిద్ధం చేశారు. ఒక్కొక్కరికీ సెంటున్నర ప్లాట్‌గా విభజించి సర్వేరాళ్లు పాతించారు. రహదారుల నిర్మాణం ప్రారంభించారు. దీంతో దళితులు కోర్టును ఆశ్రయించారు.


అవి గ్రామకంఠం భూములు.. శిరీషాదేవి, తహసీల్దార్‌  

ఆర్‌ఎస్‌ నెంబరు 16/2లోని 4 ఎకరాల 18 సెంట్లు రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠకంగా నమోదై ఉంది. ఆ భూమిపై హైకోర్టు స్టే విధించినట్టు మాకు ఉత్తర్వులు అందలేదు. పిటిషన్‌దారుల్లో ఒకరు కోర్టు స్టే ఇచ్చిందని ఒక కాపీని తెచ్చి ఇచ్చారు. ఉత్తర్వులు అందాక ఉన్నతాధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం.

Updated Date - 2020-03-21T10:10:29+05:30 IST